రాజకీయపార్టీలకు నిధులు అందడం ఎప్పట్నుంచో ఉంది. ప్రతీ పార్టీకి విరాళాలు అందుతుంటాయి. అయితే పార్టీలకు అందే నిధులలో పారదర్శకత తీసుకురావాలన్న తలంపుతో కేంద్రం ప్రభుత్వం 2018, జనవరి 2వ తేదీన ఎలక్టోరల్ బాండ్స్‌ను(Electoral Bonds) తీసుకొచ్చింది. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్(Promisory Note) లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుక్కోవచ్చు.
రాజకీయపార్టీలకు నిధులు అందడం ఎప్పట్నుంచో ఉంది. ప్రతీ పార్టీకి విరాళాలు అందుతుంటాయి. అయితే పార్టీలకు అందే నిధులలో పారదర్శకత తీసుకురావాలన్న తలంపుతో కేంద్రం ప్రభుత్వం 2018, జనవరి 2వ తేదీన ఎలక్టోరల్ బాండ్స్‌ను(Electoral Bonds) తీసుకొచ్చింది. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్(Promisory Note) లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుక్కోవచ్చు. అలా కొన్న వాటిని తమకు నచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. ఇక్కడే కేంద్రం ఓ తిరకాసు పెట్టింది. రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్(ADR), కాంగ్రెస్(Congress) నాయకురాలు జయా ఠాకూర్(Jaya Thakur), సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును(Supreme court) ఆశ్రయించారు. ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని నిరుడు అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు చెప్పింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. చిత్రమేమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నవారికి అలాంటి అవకాశం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి 5,127.97 కోట్ల రూపాయల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం 1,783.93 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. అంటే ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీకి ఎంత మేర ప్రయోజనం కలుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.