పాతాళభైరవి సినిమాలో నేపాళమాంత్రికుడు రాజకుమారి కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటాడు.
పాతాళభైరవి సినిమాలో నేపాళమాంత్రికుడు రాజకుమారి కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటాడు. అప్పుడు సదాజపుడు గురూ మీరు కూడా తోటరాముడిలా నాజూగ్గా కనిపించాలి అని అంటాడు. అప్పుడు నేపాళమాంత్రికుడు అలా కనిపించడానికి ఇప్పుడు అడ్డమేమిరా? అని అడుగుతాడు. దానికి గడ్డమే గురూ! అని జవాబిస్తాడు సదాజపుడు! అంటే గడ్డం ఉన్నవారు రఫ్‌గా కనిపిస్తారన్నమాట! ఇదే డౌట్ ఇప్పుడు కూడా చాలా మందికి కలుగుతుంది. అబ్బాయిలు గడ్డంతో (Beared)అందంగా కనిపిస్తారా? ? గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌తో(Clean shave) బాగుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతుంటుంది! అబ్బాయిలు గడ్డం పెంచుకుంటేనే అందంగా ఉంటారని చాలామంది అమ్మాయిలు అంటుంటారు. ఇప్పుడందుకే యూత్ గడ్డం పెంచుకుంటున్నారు. ఒకప్పుడైతే అడుక్కుతినేవాడిలా ఆ గడ్డమేమిట్రా అని ఇంట్లోవాళ్లు తిట్టిపోసేవారు. అన్నట్టు ప్రేమలో విఫలమైన(Love failure) వారు కూడా అప్పట్లో గడ్డం పెంచుకునేవారు. అయితే క్లీన్ షేవ్‌తో ఉండే అబ్బాయిలను ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారండి! ఇందుకు మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్(Indore) అమ్మాయిలే ఉదాహరణ.. తమకు గడ్డంతో ఉన్న అబ్బాయిలు ఏ మాత్రం వద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇండోర్‌లో కొంతమంది అమ్మాయిలు కృత్రిమ గడ్డం పెట్టుకుని.. ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. గడ్డం గీసుకునే అబ్బాయిలే కావాలంటూ నిరసన తెలిపారు. నో క్లీన్ షేవ్.. నో లవ్.. బియర్డ్ హటావో గర్ల్‌ఫ్రెండ్ భూల్‌జావో ( గడ్డాన్ని వదులుకో.. లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను వదులుకో), బియర్డ్ హటావో ప్యార్ బచావో( గడ్డం తీసేయండి.. ప్రేమను కాపాడుకోండి) అంటూ నినాదాలతో అమ్మాయిలు ఫ్లకార్డులు పట్టుకుని ఇండోర్ వీధుల్లో పెద్ద ఊరేగింపే తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.