Narendra Modi : ప్రధానమంత్రి మోదీ ఎన్నికల బ్రహ్మాస్త్రం ... పీవోకే విలీనంపై పార్లమెంట్‌లో తీర్మానం..
రాబోయే సార్వత్రిక ఎన్నికలు(Elections) అటు బీజేపీ(BJP) సారథ్యంలోని ఎన్డీయేకు, ఇటు విపక్ష కూటమి ఇండియాకు(Alliance INDIA) అత్యంత కీలకం! అందుకే విజయం కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఫల్యాలను ఎండగడుతూ ఇండియా ప్రచారం మొదలుపెట్టింది.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు(Elections) అటు బీజేపీ(BJP) సారథ్యంలోని ఎన్డీయేకు, ఇటు విపక్ష కూటమి ఇండియాకు(Alliance INDIA) అత్యంత కీలకం! అందుకే విజయం కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఫల్యాలను ఎండగడుతూ ఇండియా ప్రచారం మొదలుపెట్టింది. ఆకాశం అందుకుంటున్న నిత్యావసర ధరలు, అదుపులేని ద్రవ్యోల్బణం, పెరుగుతోన్న నిరుద్యోగం వంటి సమస్యలతో పాటు స్థానిక అంశాలను కూడా ఎన్నికల్లో ప్రధానాస్త్రాలుగా మలచుకుంటోంది ఇండియా! మరోవైపు ఎన్డీయే(NDA) కూటమి మాత్రం విజయంపై కొండంత ధీమాతో ఉంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం గ్యారంటీ అన్న భరోసాతో ఉంది.
సగటు భారతీయుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో ప్రధాని నరేంద్రమోదీకి(Narendra Modi) బాగా తెలుసు. అందుకే ఎన్నికలప్పుడు ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై(Kashmir) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెల 18వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు సాగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలో పీఓకేపై(POK) కేంద్రప్రభుత్వం తీర్మాన తీసుకురావాలనుకుంటోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, ఎప్పటికైనా స్వాధీనం చేసుకుని తీరతామని అధికారంలోకి వచ్చినప్పట్నుంచి బీజేపీ చెబుతూ వస్తోంది. ఇందుకు అనుగుణంగానే అప్పుడప్పుడు కేంద్ర మంత్రుల నోటి వెంట పీఓకే స్వాధీనం వంటి మాటలు వస్తుంటాయి.
పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు బాగా తెలుసని ఆ మధ్య అమిత్ షా వ్యాఖ్యానించారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని అన్నారు రాజ్‌నాథ్ సింగ్. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు భారత్‌లోకి రావాలని కోరుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాలుగు నెలల కిందట కామెంట్ చేశారు. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి, మాజీ ఆర్వీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కూడా పీఓకేపై మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే అదే వచ్చి భారత భూభాగంలో కలిసి పోతుందని, అక్కడి ప్రజలు ఎప్పుడు సరిహద్దు గేట్లు తెరుచుకుంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారని సింగ్ అన్నారు.
ఇవన్నీ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం పీఓకే విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ఉందనిపిస్తోంది. ఇప్పుడు పార్లమెంట్‌లో తీర్మాన తీసుకువస్తే మాత్రం స్వతంత్ర భారతంలో ఇదో గొప్ప నిర్ణయమవుతుంది. ఇటీవలి కాలంలో పీఓకేలో నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన అసహనంతో ఉన్నారు. తమ ప్రభుత్వాలపై నిరననలు వ్యక్తం చేస్తున్నారు. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. భారత్‌లోని లద్దాఖ్‌లో కలిసిపోతామని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ సానుకూల సంకేతాలుగా కేంద్రం భావిస్తున్నదని సమాచారం.
మరికొద్ది నెలలలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్న ఈ నేపథ్యంలో ఇది బీజేపీకి భారీ ప్రచారాస్త్రం అవుతుందని కమలం నేతలు అనుకుంటున్నారు. ఒకవేళ పార్లమెంట్‌లో పీఓకేపై తీర్మానం చేసే అవకాశాలు లేకపోతే 1994లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో పార్లమెంట్ చేసిన తీర్మానంలో కొన్ని సవరణలు చేసి తిరిగి ప్రతిపాదించే అవకాశం ఉందని అంటున్నారు. జీ 20 సమావేశాలను భారత్ చాలా గొప్పగా నిర్వహించింది. విదేశీ మీడియా కూడా ప్రశంసించింది.
ఇక సమావేశాలకు వచ్చిన వివిధ దేశాధినేతలు కూడా మోదీ ప్రభుత్వాన్ని పొగిడారు. భారత్‌కు మద్దతుగా ఉంటామని చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ స్థాయి పెరగడంతో పాటు పశ్చిమ దేశాల అండ కూడా లభించడంతో పీఓకేపై యాక్షన్ తీసుకోవడానికి దే మంచి సమయమని కేంద్రం భావిస్తోంది. పీఓకేలో ఉన్న సహజవనరులను పాకిస్తాన్ ప్రభుత్వం కొల్లగొట్టడం, అవినీతి బాగా పెరగడం, శాంతిభద్రతలు క్షీణించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని స్థానిక మీడియా అంటోంది.