జమిలి ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ (Central Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ (One Nation-One Election) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు బీజేపీ ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2023 సెప్టెంబర్‌లో కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. 18 వేలకుపైగా పైచిలుకు పేజీలతో కమిటీ నివేదిక రూపొందించి మార్చిలో కేంద్రానికి సమర్పించింది. దీనికి గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగానికి 18 సవరణలను కోవింద్ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే 2027లో దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. 2026లో దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరగనుంది. దీంతో నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు జమిలి ఎన్నికల రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు 32 పార్టీలకు చెందిన ప్రముఖులు సమర్థించడం గమనార్హం