NIPAH Virus : మరోసారి ప్రమాదకర వైరస్ కలకలం
కేరళలోని(Kerala) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు నిపా వైరస్(NIPA Virus) కారణంగానే చనిపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమై అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు.
నిపాతో ఇద్దరు మృతి?
నిపుణుల కమిటీ ఏర్పాటు
కేరళలోని(Kerala) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు నిపా వైరస్(NIPAH Virus) కారణంగానే చనిపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమై అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు వెలుగులోకి వచ్చాయి. నిపా వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు కేరళ ఆరోగ్య శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం వైద్యాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్(Veena George). అనంతరం ఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. మృతుల బంధువు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ మరణాలకు గల కారణాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంగళవారం మధ్యాహ్నం దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రానుంది. మొదటి మరణం ఆగస్టు 30న సంభవించిందని అధికారులు తెలిపారు. 2018 నుంచి 2021 వరకు కేరళలో అనేక నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ భారత్‌లో 2018 మే19 మొదటి నిపా వైరస్ కేసు నమోదైంది. 2019 మరో నిపా కేసులు వెలుగులోకి వచ్చింది. 2021లోనూ మెదడవాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్‌ను గుర్తించారు వైద్యులు.
నిపా వైరస్ వ్యాప్తి..
నిపా వైరస్‌ను 1989లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు. నిపా వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో.. పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. వైరస్ ఉన్న గబ్బిలాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కాంటాక్ట్ ద్వారానే.. నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్లు మీదకి చేరినప్పుడు.. ఆ పండ్లు, పళ్ల రసాల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని పేర్కొంటున్నారు.
దీనికి ప్రత్యేకమైన టీకాలు, చికిత్స లేకపోవటం ఆ భయాలను మరింత పెంచుతున్నాయి. కొవిడ్‌తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిపా వైరస్ సోకుతోంది. నిపా వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతాయి.