మణిపూర్‌లో(Manipur) ఇంకా మండుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. నాలుగు నెలలుగా ఆ ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతూనే ఉంది. మార్చిలో కుకీ(Kuki), మైతీ(Mythi) తెగల మధ్య అంటుకున్న వైరం హింసాత్మకంగా మారింది. మారణహోమాలు జరుగుతున్నాయి. వెలుగులోకి రాని ఎన్నో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నాయి.
మణిపూర్‌లో(Manipur) ఇంకా మండుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. నాలుగు నెలలుగా ఆ ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతూనే ఉంది. మార్చిలో కుకీ(Kuki), మైతీ(Mythi) తెగల మధ్య అంటుకున్న వైరం హింసాత్మకంగా మారింది. మారణహోమాలు జరుగుతున్నాయి. వెలుగులోకి రాని ఎన్నో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నాయి. తాజాగా మణిపూర్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, ఆ తర్వాత వారు హత్యకు గురి కావడం ఆలస్యంగా వెలుగు చూసింది. గత జూలైలో ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఆ విద్యార్థులు అల్లరి మూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవే కాకుండా వారిద్దరు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. జనం తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు ఎందుకింత సమయం పట్టిందంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 17 ఏళ్ల హిజామ్ లిన్‌తో ఇంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్ జూలై నుంచి కనిపించకపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఓ అడవిలో గడ్డి మైదానంలో వారిద్దరు కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో వారి వెనుక కొంచెం దూరంలో సాయుధ గ్రూపుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని నిలబడి ఉన్నారు. మరో ఫోటోలో వారిద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్టు కనిపిస్తోంది.
ఈ ఫోటోలు వైరల్‌గా మారాడంతో మణిపూర్ ప్రభుత్వం స్పందించింది. జూలై నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రావడం తమ దృష్టికి వచ్చినట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఎలా అదృశ్య మయ్యారు? ఎవరు కిడ్నాప్ చేశారు? వారిని హత్య చేసిన వారెవరు? వంటి విషయాలను తెలుసుకోవడానికి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఘటనకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో అధికారులు అధునాతన సైబర్ ఫోరెన్సిక్స్ సాధనాలను ఉపయోగించనున్నారని వీటి ద్వారా ఫోటోలు మరింత స్పష్టంగా చేసి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు తోడ్పడనున్నట్లు తెలిపింది.