తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన ఇంటి పరిసరాల్లో పడిపోవడంతో
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన ఇంటి పరిసరాల్లో పడిపోవడంతో గురువారం ఆసుపత్రిలో చేరారు. ఆమె నుదిటిపై గాయం కావడంతో ఆమెను ప్రభుత్వ SSKM ఆసుపత్రిలో చేర్చారు. పార్టీ సోషల్ మీడియా పేజీలో అప్‌లోడ్ చేసిన మమతా బెనర్జీ ఫోటోలలో.. ఆమె నుదిటిపై గాయంతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్నట్లు చూపించాయి. "ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు మా ఆసుపత్రికి వచ్చారు, వెనుక నుండి ఎవరైనా నెట్టడం వల్ల ఆమె ఇంటి పరిసరాల్లో పడిపోయే అవకాశం ఉంది. ఆమె మెదడుకు కంకషన్ ఉంది. ఆమె నుదిటి భాగం, ముక్కుపైన గాయాలు ఉన్నాయి. విపరీతంగా రక్తం కారుతోంది." అని SSKM హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆమె నుదుటిపై కుట్లు వేసిన తర్వాత ఆమెను నివాసానికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. మమతా బెనర్జీకి న్యూరోసర్జరీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణులు చికిత్స అందించారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్, సీటీ స్కాన్ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పినప్పటికీ ఇంటికి వెళ్లాలంటూ ఆమె పట్టుబట్టారని వైద్యులు తెలిపారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం సీఎం మమతాబెనర్జీ శుక్రవారం మరోసారి ఆస్పత్రికి వెళ్లనున్నారు.