ఆషాఢ మాసంలో(Ashada masam) తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి(Devasayana ekadashi), పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు.
ఆషాఢ మాసంలో(Ashada masam) తొలి ఏకాదశినే దేవశయని ఏకాదశి(Devasayana ekadashi), పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని తొలి ఏకాదశినాడు క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీ మహా విష్ణువు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణుపురాణం పేర్కొంది. ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లి కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడు. . అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండగలు ప్రారంభం అవుతాయి. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడని, ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. జైన మతంలో కూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది. జైనులకూ చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా నాలుగు నెలలపాటు ప్రయాణం చేయకుండా.. ఒకే చోట ఉండి శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి నిన్నటి రోజు జులై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై.. ఈ రోజు జులై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతోపాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.