ఎన్నికల వేళ రాజకీయ నాయకుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడటం రాకపోతే నోర్మూసుకునైనా ఉండాలే తప్ప ఏది పడితే అది మాట్లాడకూడదు. కర్ణాటక ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న రామప్ప తిమ్మాపూర్ ఇట్లాగే నోరు జారేశారు
ఎన్నికల వేళ రాజకీయ నాయకుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడటం రాకపోతే నోర్మూసుకునైనా ఉండాలే తప్ప ఏది పడితే అది మాట్లాడకూడదు. కర్ణాటక (Karnataka) ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న రామప్ప తిమ్మాపూర్ (Ramappa timmapur) ఇట్లాగే నోరు జారేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్ణాటక సెక్స్ స్కాండిల్ కేసులో ప్రధాన నిందితుడైన జనతాదళ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవెగౌడ (Dewe Gouda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణను కృష్ణుడితో పోల్చారా మంత్రి! విజయపురంలో జరిగిన ఓ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ‘ఎంబీ పాటిల్ చెప్పినట్లుగా ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) వీడియోలున్న ఈ పెన్‌డ్రైవ్ ఉదంతానికి మించి దేశంలో మరో ఘోరం జరగలేదు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే ఛాన్సుంది. తనను భక్తితో ఆరాధించే చాలమంది మహిళలతో శ్రీకృష్ణుడు కలిసి జీవించాడు. ఈ కేసులో అలా కాదు. ప్రజ్వల్ ఆ రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. తిమ్మాపూర్ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొంపలంటుకుపోయే ప్రమాదం ఉందని భావించిన అధికార కాంగ్రెస్ తిమ్మాపూర్ వ్యాఖ్యలను ఖండించింది. మంత్రి వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని చెబుతూ వస్తోంది. ఇది పార్టీ అధికారిక అభిప్రాయం కాదని తెలిపింది. రేవణ్ణ ఓ రాక్షసుడని పేర్కొంది.