ఉత్తర కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని అరగామ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడని పోలీసు వర్గాలు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సమావేశంలో, జమ్మూ ప్రాంతంలో ఉద్భవిస్తున్న ఉగ్రవాదంపై ధీటుగా స్పందించాలని షా ఉన్నతాధికారులను ఆదేశించారు.

అరగామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రత బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. మృతి చెందిన ఉగ్రవాది మృతదేహాన్ని డ్రోన్ సాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ జమ్మూలో పర్యటించనున్నారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత రెండు వారాల్లో, జమ్మూ, కశ్మీర్‌లోని రియాసి, కతువా, దోడా జిల్లాల్లోని నాలుగు ప్రదేశాలలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఫలితంగా ఒక CRPF జవాన్‌తో సహా 9 మంది వ్యక్తులు మరణించారు.


Eha Tv

Eha Tv

Next Story