లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం చాలా కలత చెందుతున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం చాలా కలత చెందుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఇంటి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వర్షం వస్తే పైకప్పు నుండి నీరు కారుతుంది. పదేపదే కోరినప్పటికీ.. ఇంటి పరిస్థితి మెరుగుపడలేదని వాపోతున్నారు. సోమవారం తేజ్ ప్రతాప్ యాదవ్ తనకు కేటాయించిన ఇంటిని స్థానిక మీడియాకు చూపించాడు. నివాసంలో గడ్డి.. వెనుక భాగంలో చాలా చెత్తతో నిండివుంది.
రెండు నెలల క్రితమే ఈ ఇంట్లో నివాసం ఉండేందుకు వచ్చానని.. అయితే ఈ ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తేజ్ ప్రతాప్‌కు 3 M స్ట్రీట్ రోడ్‌లో నివాసం కేటాయించబడింది. కానీ మంత్రి పదవిని వీడిన తర్వాత ఆయనకు స్ట్రాండ్ రోడ్ నంబర్ 26లో నివాసం కేటాయించారు.
మంత్రుల బంగ్లా మెరిసిపోతుందని.. కానీ మాలాంటి ఎమ్మెల్యేలకు శిథిలావస్థలో ఉన్న బంగ్లాలు ఇచ్చారని తేజ్ ప్రతాప్ అన్నారు. అక్కడ పాములు, తేళ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. నీరు కారుతుంది. కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినా ఏమీ పని జరగలేదన్నారు. కాంట్రాక్టర్, ఇంజనీర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.