నీట్‌ పరీక్ష తమకు వద్దే వద్దని ముందు నుంచి చెబుతూ వస్తున్నది తమిళనాడు రాష్ట్రం మాత్రమే! నీట్‌ను బలవంతంగా తమపై రుద్ద వద్దని వాదిస్తున్నది కూడా ఆ రాష్ట్రమే!

నీట్‌ పరీక్ష(NEET Exam) తమకు వద్దే వద్దని ముందు నుంచి చెబుతూ వస్తున్నది తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం మాత్రమే! నీట్‌ను బలవంతంగా తమపై రుద్ద వద్దని వాదిస్తున్నది కూడా ఆ రాష్ట్రమే! నీట్‌ నుంచి రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా తమిళనాడే! నీట్‌ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌(TamilNadu CM MK. Stalin) ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi)తో పాటు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్ష నుంచి రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న స్టాలిన్‌ అసలు జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని అన్నారు. వైద్య విద్యలో విద్యార్ధుల ఎంపికను ప్ర‌త్యేక ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా కాకుండా ప్ల‌స్ టూ (ఇంటర్మిడియట్‌) మార్కుల ఆధారంగా మాత్ర‌మే ఉండాల‌ని స్టాలిన్‌ కోరారు. దానివల్ల విద్యార్ధుల‌పై అనవసరమైన అదనపు ఒత్తిడి ఉండదని అన్నారు. 'ఇందుకు సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని అలాగే 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది' అని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. నీట్‌ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై తమిళనాడు ఆందోళన చేస్తున్నదని చెప్పారు. నీట్‌ తొలగింపును ఇతర రాష్ట్రాలు కూడా కొరుకుంటున్నాయని అన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలపాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు. నీట్‌ను రద్దు చేయడానికి శాసనసభలలో ఇదే రకమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులను లేఖ ద్వారా స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

Updated On 29 Jun 2024 9:33 AM GMT
Eha Tv

Eha Tv

Next Story