త్రివర్ణ పతాకం(National Flag) మన జాతి గౌరవ సంకేతం! మన జాతి ఔన్నత్యానికి నిదర్శనం. మన జాతి వైభవానికి చిహ్నం. రెపరెపలాడే ఆ జెండాను చూస్తే తెలియకుండానే ఓ ఉద్విగ్నత కమ్ముకుంటుంది. అది జెండా గొప్పదనం. ఇప్పుడు మనదేశంలోని అత్యంత ఎత్తయిన జాతీయ జెండాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! అయినా జెండా ఎత్తున ఉంటే ఏమిటి..? పెద్దగా ఉంటే ఏమిటి..? దేశభక్తి గుండెల నిండుగా ఉండాలే గానీ గుండె మీద గుండిసూదితో పెట్టుకున్న చిన్ని పతాకం సరిపోదూ!

త్రివర్ణ పతాకం(National Flag) మన జాతి గౌరవ సంకేతం! మన జాతి ఔన్నత్యానికి నిదర్శనం. మన జాతి వైభవానికి చిహ్నం. రెపరెపలాడే ఆ జెండాను చూస్తే తెలియకుండానే ఓ ఉద్విగ్నత కమ్ముకుంటుంది. అది జెండా గొప్పదనం. ఇప్పుడు మనదేశంలోని అత్యంత ఎత్తయిన జాతీయ జెండాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! అయినా జెండా ఎత్తున ఉంటే ఏమిటి..? పెద్దగా ఉంటే ఏమిటి..? దేశభక్తి గుండెల నిండుగా ఉండాలే గానీ గుండె మీద గుండిసూదితో పెట్టుకున్న చిన్ని పతాకం సరిపోదూ! అయినప్పటికీ ఎత్తుగా నిలిచిన త్రివర్ణ పతకాలను చూడటం మనకు గర్వకారణమే కదా! దేశంలో ఎత్తయిన జెండా ఉన్నది కర్ణాటకలోని(Karnataka) బెల్గావ్‌లో(Belgaum) ! అధికారికంగా బెల్గావిగా పిల్చుకునే ఈ ప్రదేశంలో మన దేశ జెండా 361 అడుగుల ఎత్తుతో సమున్నంతగా నిలిచింది.

ఈ జెండా 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో రెపరెపలాడుతూ ఉంటుంది. జెండా బరువు సుమారు 500 కిలోలు ఉంటుందట! ఇక అమృత్‌సర్‌(Amritsar) దగ్గర ఉన్న అటారీ సరిహద్దులో(Atari Borders) కూడా ఇంచుమించు ఇదే ఎత్తున జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది. బెల్గావ్‌తో పోలిస్తే ఇది కేవలం ఓ అడుగు మాత్రమే తక్కువ. అంటే ఈ జెండా స్తంభం ఎత్తు 360 అడుగులన్నమాట! జెండా సైజు మాత్రం సేమ్‌ టు సేమ్‌! మహారాష్ట్ర పూణెలో(Pune) భక్తి శక్తి గార్డెన్‌(Bhakthi shakthi Gardens) ఉంది. పింప్రీ చించువాడ్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ అధీనంలో ఉందీ గార్డెన్‌.. ఇక్కడ 351 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.

అసోంలోని(Assam) గౌహతిలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అత్యంత ఎత్తులో ఓ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఇదే ఎత్తైన జాతీయ జెండా! జెండా స్తంభం ఎత్తు 319.5 అడుగులు. మహారాష్ట్రలోనే కొల్హాపూర్‌లో 303 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఉంది. 2017లో అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ జెండాను ప్రారంభించారు. ఇక జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పహారీ మందిర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా 99 అడుగుల పొడవు, 66 అడుగుల వెడల్పుతో 293అడుగుల ఎత్తులో ఉంది.

తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో 291 అడుగుల ఎత్తయిన జెండా స్తంభంపై 108 అడుగుల పొడవు.. 72 అడుగుల వెడల్పుతో తయారుచేసిన జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. స్తంభం బరువే 40 టన్నులు ఉంటుంది! జెండా బరువు 65 కిలోలు ఉంటుంది.. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు దాదాపు మూడు కోట్ల రూపాయలు... నిజానికి 303 అడుగుల ఎత్తులో జెండాను సమోన్నతంగా నిలపాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం..

కాకపోతే ఏవియేషన్‌ అధికార వర్గాలు ఒప్పుకోకపోవడంతో ఎత్తును కుదించారు. అయితే పతాకం మాత్రం రాంచీతో పోలిస్తే పెద్దదే! చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 269 అడుగుల ఎత్తయిన జాతీయ జెండా ఉంది. 105 అడుగుల పొడవు.. 70 అడుగుల వెడల్పుతో ఉన్న జాతీయ పతాకాన్ని 269 అడుగుల ఎత్తున్న స్తంభంపై ఎగరేశారు. మెరైన్‌ డ్రైవ్‌గా పేరున్న తేలిబండ సరస్సు తీరంలో ఈ మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేశారు. హర్యానాలోని ఫరిదాబాద్‌లో 250 అడుగుల ఎత్తున నిలిచిన జాతీయ జెండా ఉంది.

ఫరిదాబాద్‌లోని టౌన్‌పార్క్‌లో రెపరెపలాడుతున్న ఈ జెండాను చూడటం ఓ అనుభూతి. పూణెలోని కట్రాజ్‌ సరస్సు సమీపంలో 237 అడుగుల ఎత్తులో, మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 235 అడుగుల ఎత్తులో, నవీ ముంబాయిలో 222 అడుగుల ఎత్తులో, ఒడిషాలోని కటక్‌లో 215 అడుగుల ఎత్తులో జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ కనాట్‌ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్క్‌లో 207 అడుగుల నిలువెత్తు జెండా సగర్వంగా ఎగురుతోంది.. 90 అడుగుల పొడవు.. 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ జెండాను 2014లో ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని జ్ఞానేశ్వర్‌ పార్క్‌లో కూడా ఇంతే ఎత్తున్న జెండా ఉంది.

Updated On 14 Aug 2023 3:59 AM GMT
Ehatv

Ehatv

Next Story