ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి తనపై దాడికి పాల్పడ్డారని
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి తనపై దాడికి పాల్పడ్డారని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్)కి కాల్ రావడంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్వాతి మలివాల్ పేరుతో తమకు పీసీఆర్ కాల్ వచ్చినట్టు ఢిల్లీ పోలీసులు కూడా ధృవీకరించారు. నిందితుడిని బిభవ్ కుమార్‌గా గుర్తించారు. సీఎం హౌస్ వద్ద తనపై దాడి జరిగినట్టు సివిల్ లైన్స్ పీఎస్‌కు ఒక మహిళ నుంచి కాల్ వచ్చిందని, ఆ తర్వాత కొద్దిసేపటికి స్వాతి మలివాల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారని డీసీపీ (నార్త్) మనోజ్ మీనా తెలిపారు. తర్వాత ఫిర్యాదు ఇస్తానంటూ ఆమె వెంటనే వెళ్లిపోయినట్టు తెలిపారు. అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఉదయం 10 గంటల ప్రాంతంలో తమకు రెండు ఫోన్ కాల్స్ మాత్రం వచ్చాయని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు. వెంటనే సీఎం నివాసానికి తమ పోలీస్ టీమ్ వెళ్లిందని, అయితే ప్రోటోకాల్ ప్రకారం లోపలకు వెళ్లలేదన్నారు.
స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలపై సీఎం ఇంటి నుంచి కానీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. స్వాతి మలివాల్ ఈ ఏడాది జనవరిలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. సీఎం ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇది చాలా తీవ్రమైన విషయమని బీజేపీ నేతలు తెలిపారు.