సుప్రీం కోర్టు తాజాగా ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది, గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు తాజాగా ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది, గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు తమిళనాడు సర్కారు వర్సెస్ గవర్నర్ కేసులో వచ్చింది.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ప్రకారం, ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ మూడు విధాలుగా డీల్ చేయవచ్చు
అంగీకరించడం, తిరస్కరించడం (రీకన్సిడరేషన్ కోసం శాసనసభకు తిరిగి పంపాలి). రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడం. ఆర్టికల్ 201లో, గవర్నర్ రాష్ట్రపతికి బిల్లు పంపితే, రాష్ట్రపతి దాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కానీ, ఈ ప్రక్రియకు రాజ్యాంగంలో ఎలాంటి టైమ్‌లైన్ లేదు, దీనివల్ల గవర్నర్లు లేదా రాష్ట్రపతి బిల్లులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచడం సమస్యగా మారింది.
తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్. రవి(RN Ravi) 10 బిల్లులను 2020 నుంచి పెండింగ్‌లో ఉన్నవి రాష్ట్రపతికి పంపారు. శాసనసభ మళ్లీ పాస్ చేసిన తర్వాత కూడా. దీన్ని తమిళనాడు సర్కారు సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే, రాష్ట్రపతి ఆ బిల్లు అందిన తేదీ నుంచి మూడు నెలల్లో నిర్ణయం (అంగీకారం లేదా తిరస్కరణ) తీసుకోవాలి. ఒకవేళ ఈ గడువు దాటితే, ఆలస్యానికి సరైన కారణాలు రాష్ట్ర సర్కారుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. రాష్ట్రపతి బిల్లును అనిర్దిష్టంగా పెండింగ్‌లో ఉంచే "అబ్సల్యూట్ వీటో" లేదా "పాకెట్ వీటో" అధికారం లేదు. తిరస్కరిస్తే, దానికి స్పష్టమైన, వివరణాత్మక కారణాలు చెప్పాలి. ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అనిపిస్తే, రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు అభిప్రాయం తీసుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అధికారం కోర్టులదే.
తమిళనాడు కేసులో, గవర్నర్ బిల్లులను శాసనసభ మళ్లీ పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు చెప్పింది. ఆర్టికల్ 200 ప్రకారం, శాసనసభ రీకన్సిడర్ చేసి మళ్లీ పంపితే, గవర్నర్ తప్పనిసరిగా అంగీకరించాలి. ఈ కేసులో, గవర్నర్ బిల్లులను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచి "బోనా ఫైడ్" (నిజాయతీ) లేకుండా పనిచేశారని కోర్టు విమర్శించింది. ఈ 10 బిల్లులు చాలా కాలం పెండింగ్‌లో ఉండడం, గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహరించడం వల్ల, సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాలు (ఆర్టికల్ 142) ఉపయోగించి, ఈ బిల్లులను శాసనసభ మళ్లీ పంపిన తేదీ నాటికి గవర్నర్ అంగీకరించినట్లు డీమ్డ్ అసెంట్‌గా ప్రకటించింది.
రాష్ట్రపతి మూడు నెలల గడువు దాటితే, లేదా తిరస్కరణకు సరైన కారణాలు చెప్పకపోతే, రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించొచ్చు. గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులను అనవసరంగా ఆలస్యం చేయడం వల్ల రాష్ట్రాల శాసనసభల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఎన్నికైన శాసనసభలు ప్రజల ఇష్టాన్ని ప్రతిబింబిస్తాయి. గవర్నర్ లేదా రాష్ట్రపతి అనవసర జోక్యం దీన్ని దెబ్బతీస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 201లో టైమ్‌లైన్ లేని లోటును సరిచేస్తూ, సర్కారియా కమిషన్ (1983), పుంఛి కమిషన్ (2007) సిఫార్సులను ఆధారంగా తీసుకుని, కోర్టు మూడు నెలల గడువు విధించింది.
ఈ 10 బిల్లులు యూనివర్సిటీ వైస్-చాన్సలర్ నియామకాలు, ఖైదీల ముందస్తు విడుదల, పబ్లిక్ సర్వెంట్స్‌పై ప్రాసిక్యూషన్ వంటి అంశాలతో సంబంధం కలిగి ఉన్నాయి. గవర్నర్ ఈ బిల్లులను 2020 నుంచి పెండింగ్‌లో ఉంచారు, తర్వాత 2023లో రాష్ట్రపతికి పంపారు. శాసనసభ మళ్లీ పాస్ చేసినా, మళ్లీ రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధమని కోర్టు తేల్చింది. కేరళ, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో ఉంచిన కేసులు ఉన్నాయి. కేరళ సర్కారు ఇప్పటికే తమ కేసును సుప్రీం కోర్టులో ఈ తీర్పుతో లింక్ చేస్తూ వాదిస్తోంది. ఈ తీర్పు గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులపై తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువ పారదర్శకత, జవాబుదారీతనం తెస్తుంది.
