ఓ భార్యతో కాపురం చేస్తున్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం తప్పు.

ఓ భార్యతో కాపురం చేస్తున్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు(supreme court) చాలా సార్లు చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు రెండో భార్య(Second wife) పక్షాన నిలిచింది. తన భర్త చనిపోయాడని, తనకు కంపెనీ నుంచి రావాల్సిన పెన్షన్‌ను ఇప్పించాలంటూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చనిపోయిన వ్యక్తికి ఈమె రెండో భార్య. మొదటి భార్య ఉండగానే ఈమెను పెళ్లి చేసుకున్నాడా వ్యక్తి. సుప్రీంకోర్టు ఈ మహిళ కేసును చాలా ప్రత్యేకంగా చూసింది. మహిళ పక్షాన నిలిచింది. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి ఆమెకు రావాల్సిన పెన్షన్(Pension) ఇవ్వాల్సిందేనంటూ సదరు కంపెనీని ఆదేశించింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా(Justice Sanjiv khanna), జస్టిస్‌ సంజయ్‌కుమార్(Sanjay kumar), జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌తో(R Mahadevan) కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దీనిని ప్రత్యేకమైన కేసుగా ధర్మాసనం అభివర్ణించింది. వివరాల్లోకి వెళితే జయ్‌ నారాయణ్‌ మహారాజ్‌ అనే వ్యక్తి సౌత్ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్‌లో పని చేస్తూ 1983లో పదవి విరమణ చేశారు. ఆయనకు రామ్‌ సవారీ దేవి అనే భార్య ఉండింది. ఆమె ఉన్నప్పుడే రాధాదేవి అనే మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 1984లో రామ్‌ సవారీ దేవీ చనిపోయారు. వచ్చే పెన్షన్‌తో జయ్‌ నారాయణ్‌-రాధాదేవి దంపతులు జీవనం సాగించారు. 2001లో జయ్‌ నారాయణ్‌ కూడా చనిపోయారు. దీంతో వయసు పైబడిన తనకు పెన్షన్‌ ఇప్పించాల్సిందిగా జయ్‌ నారాయణ్‌ పనిచేసిన కంపెనీని అదే ఏడాది రాధాదేవి కోరారు. అయితే రాధాదేవి విన్నపాన్ని కంపెనీ తిరస్కరించింది. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు ఈమెకు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు మూలాలను పరిశీలించిన సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142లోని ప్రత్యేక అధికారాలను వినియోగించి రాధాదేవికి పెన్షన్ ఇవ్వాల్సిందేనంటూ కంపెనీని ఆదేశించింది. మొదటి భార్య ఉండగానే రాధాదేవి జయ్‌ నారాయణ్‌ను పెండ్లి చేసుకొన్నప్పటికీ, వాళ్లు ముగ్గురు అన్యోన్యంగా ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండో పెళ్లికి మొదటి భార్య రామ్‌ సవారీ దేవి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని దీన్ని బట్టి అర్థమవుతున్నదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 2010 నుంచి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన పింఛన్‌ మొత్తాన్ని రాధాదేవి బ్యాంకు ఖాతాలో ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా జమ చేయాలని కంపెనీని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Eha Tv

Eha Tv

Next Story