తనకు బీఎండబ్ల్యూ(BMW) నాసిరకం కారును విక్రయించారని ఓ వ్యక్తి గత 15 ఏళ్లుగా పోరాడుతున్నాడు.
తనకు బీఎండబ్ల్యూ(BMW) నాసిరకం కారును విక్రయించారని ఓ వ్యక్తి గత 15 ఏళ్లుగా పోరాడుతున్నాడు. ఎట్టకేళకు తన పోరాటానికి ఫలితం దక్కింది. బాధితుడికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు(supreme court) ఆదేశించింది. లగ్జరీ, ఖరీదైన కార్లలో బీఎండబ్ల్యూ కూడా ఒకటిగా ఉంటుది. అయితే తన కారులో వచ్చిన సమస్యలపై తొలుత కన్స్యూమర్ కోర్టు, ఆ తర్వా త హైకోర్టు, తదనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లి అనుకున్నది సాధించాడు. వివరాల్లోకి వెళ్తే
2009 సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో ఓ కస్టమర్ బీఎండబ్ల్యూ-7 సిరీస్ కారు కొన్నాడు. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆ కారులో కొన్ని సమస్యలు గుర్తించాడు. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయగా సిబ్బంది వచ్చి కారును చెక్ చేసి, మళ్లీ అతనికే ఆ కారును హ్యాండోవర్ చేశారు. కానీ నవంబర్ 13, 2009న ఇదే సమస్య బయటపడింది. దీంతో బీఎండబ్ల్యూ డీలర్‌పై ఆగ్రహం చెందిన కస్టమర్ తొలుత కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. తర్వాత అదే ఏడాది నవంబర్ 16న అప్పటి ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు బీఎండబ్ల్యూ డీలర్‌పై క్రిమినల్ కేసును కొట్టి వేసి కస్టమర్‌కు కొత్త కారును ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇందుకు కస్టమర్ అంగీకరించలేదు. దీంతో కస్టమర్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ తనకు కొత్త కారు వద్దని, తన కారుకు పెట్టిన నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాడు. దీంతో సుదీర్ఘ కాలం విచారించిన సుప్రీంకోర్టు కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వినియోగదారుడికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బీఎండబ్ల్యూ డీలర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇన్నేళ్ల తన కష్టానికి ఎంతో కొంతనైనా ఉపశమనం దొరికిందని వినియోగదారుడు, నష్టపరిహారం తీసుకునేందుకు అంగీకరించాడు.