కాలాన్ని నియంత్రించేది ఆ సృష్టికర్తే. ! కాల విభజన చేసింది కూడా ఆయనే! మూడు కాలాలు-ఆరు రుతువులు- పన్నెండు మాసాలు ఇచ్చి పండుగలు చేసుకోమన్నాడు. చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అందుకే మనం ఆ రోజున యుగాది జరుపుకుంటాం.

కాలాన్ని నియంత్రించేది ఆ సృష్టికర్తే. ! కాల విభజన చేసింది కూడా ఆయనే! మూడు కాలాలు-ఆరు రుతువులు- పన్నెండు మాసాలు ఇచ్చి పండుగలు చేసుకోమన్నాడు. చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అందుకే మనం ఆ రోజున యుగాది జరుపుకుంటాం. మనమే కాదు. పక్కనే ఉన్న కర్నాటక, పొరుగునే ఉన్న మహరాష్ర్ట కూడా ఇదే రోజున సంవత్సరాదిగా జరుపుకుంటాయి. మరికొన్ని ప్రాంతాలలో మేష సంక్రాంతి రోజున సంవత్సరాదిగా జరుపుకుంటారు.. భిన్న సంస్కృతులతో.. భిన్న నాగరికతలలో విలసిల్లుతోన్న మన భారతదేశంలో నూతన సంవత్సర వేడుకలు ఒక్కో చోట ఒక్కో రకంగా జరుగుతాయి.

చైత్రమాసం చిగురువిచ్చుకోవడానికి సిద్ధమవుతోంది.. మత్తకోయిలలు గొంతును శ్రుతి చేసుకుంటున్నాయి. మావిచిగురు హరితవర్ణాన్ని సంతరించుకోవడానికి ఉబలాటపడుతున్నాయి. మల్లెలు ఘుమఘుమలను వెదజల్లడానికి తహతహలాడుతున్నాయి. ఆమని రాకకోసం అవని ఆత్రంగా ఎదురుచూస్తోంది.. ఈ శుభసమయం దగ్గరపడింది.. కొత్త సంవత్సరానికి ముహూర్తం ఆస్నమయ్యింది..

ఉగాది. తెలుగువారికి సంవత్సరాది! కొత్త ఆశలనే లగేజ్‌ను, సరికొత్త ఆశయాలనే బ్యాగేజ్‌ను, ఆకాంక్షలనే మంజూషాన్ని మోసుకుని శోభకృత్‌ నామ సంవత్సరం వచ్చేసింది. ఆ అదృష్టదాయని రాకను పురస్కరించుకుని పల్లె, పట్నం అన్న తేడా లేకుండా అంతటా పండగశోభ పరుచుకుంది. తెలుగు లోగిళ్లు అందంగా ముస్తాబయ్యి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి...మన సంస్కృతి...సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరిగే కవి సమ్మేళనాలు...సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమవుతోంది...

ఓటమి వెనుక గెలుపు, చీకటి వెనుక వెలుగు, విషాదం తర్వాత ఆనందం, దు:ఖం వెంటనే సంతోషం. ఇదే జీవితం. దానికి ప్రతీకే ఉగాది. అందుకే తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం కలబోతతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. తెలుగువారికి ఇది తొలి పండుగ. జీవితంలో తారసపడే ఆటు పోట్లను ఎదుర్కొనే మనోస్థయిర్యాన్ని, మనో ధైర్యాన్ని కల్పించాలని యుగ పురుషుడిని వేడుకునే రోజు ఇది! ఒక్క తెలుగువారికే కాదు.. మహరాష్ట్రీయులు, కన్నడిగులు కూడా ఇదే రోజును సంవత్సరాదిగా జరుపుకుంటారు. మహరాష్ర్టలో గుడి పాడ్వాగా జరుపుకుంటారు .. పాడ్వా అంటే పాడ్యమి. బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ఆరంభించినందుకు గుర్తుగా బ్రహ్మధ్వజాన్ని ఇంటి ముందు నిలబెడతారు. ఓ వెదురు కర్రకు జరీ ఉన్న ఎరుపు పసుపు కలగలిసిన పట్టు వస్ర్తం చుడతారు. మామిడాకులు,వేపాకులను అలంకరిస్తారు. పటిక బెల్లాన్ని లేదా బెల్లాన్ని అమర్చుతారు. ఓ ఎర్రని బంతిపూల దండను వేస్తారు. వెదురుకర్రపై భాగంలో వెండి చెంబును కానీ రాగి చెంబును కాని బోర్లిస్తారు. ఆపై ఆ కర్రను నిటారుగా నిలబడతారు. అందరికీ కనిపించేట్టుగా ఇంటి గుమ్మం దగ్గర ఎత్తైన చోట ఈ గుడిని పెడతారు. ఇదే బ్రహ్మధ్వజం లేదా గుడి.. ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే దీని వెనుకున్న పరమార్థం.
గుడిపాడ్వా వేడుకలు ముంబాయిలో ఘనంగా జరుగుతాయి.. బ్రహ్మండమైన ఊరేగింపు జరుపుతారు. ఆ ఊరేగింపు మామూలుగా ఉండదు.. చూసి తీరాల్సిందే! పండగకు చాలా రోజుల ముందు ఏర్పాట్లు చేసుకుంటారు మహారాష్ర్ట ప్రజలు. అన్నట్టు ఇదే రోజున కొంకణ్‌ వాసులు కూడా పండుగ చేసుకుంటారు. గుడి పడ్వా రోజున షడ్రుచుల వంటకాలు చేస్తారు. శ్రీఖండ్‌ అనే వంటకాన్ని తప్పనిసరిగా చేస్తారు. కొంకణివాసులు కణగాచి ఖీర్‌ను ప్రత్యేకంగా వండుకుంటారు.

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story