అనంతానంత విశ్వాలను దాటి వెళితే అంతా పెను చీకటే! ఆ గాఢాంధకారానికి ఆవల ఓ ఆకారం దేదీప్యమానంతో, అఖండమైన రూపంతో వెలుగుతుంటుంది. ఆ దివ్యరూపమే పరమేశ్వరుడు. సకల చరాచర సృష్టికి ఆయనే అధిపతి. ఆయన సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. ఆయన నివాసం కైలాసమే కానీ అంతటా ఆయనే ఉంటాడు. భక్తితో పిలిస్తే మన చెంతకే వస్తాడు. మనం మాత్రం బొందితో ఆయన దగ్గరకు వెళ్లలేం! ఆ మహేశ్వరుడిలో లీనమైతే తప్ప కైలాస ప్రవేశం మనకు దొరకదు.

అనంతానంత విశ్వాలను దాటి వెళితే అంతా పెను చీకటే! ఆ గాఢాంధకారానికి ఆవల ఓ ఆకారం దేదీప్యమానంతో, అఖండమైన రూపంతో వెలుగుతుంటుంది. ఆ దివ్యరూపమే పరమేశ్వరుడు. సకల చరాచర సృష్టికి ఆయనే అధిపతి. ఆయన సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. ఆయన నివాసం కైలాసమే కానీ అంతటా ఆయనే ఉంటాడు. భక్తితో పిలిస్తే మన చెంతకే వస్తాడు. మనం మాత్రం బొందితో ఆయన దగ్గరకు వెళ్లలేం! ఆ మహేశ్వరుడిలో లీనమైతే తప్ప కైలాస ప్రవేశం మనకు దొరకదు. కైలాసమేమిటీ? అసలు మానవులు చేరుకోలేని సంక్లిష్టమైన చోటులో కూడా శివుడు కొలువై ఉంటాడు. ఎన్నో ప్రయాసాలకు ఓర్చితే కానీ ఆ ఆదిదేవుడి దగ్గరకు చేరుకోలేం. జమ్ములో(Jammu) శివఖోరి గుహాలయం(Sivakhori cave) కూడా ఇలాంటి క్షేత్రమే! అక్కడికి వెళ్లడం చాలా చాలా కష్టం. కశ్మీరిలో ఖోరి అంటే గుహ. అక్కడ శివుడు కొలువై ఉన్నాడు కాబట్టి దానికి శివఖోరి అని పేరు వచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లా రణసు(ranasu) అనే గ్రామంలో ఉంది శివఖోరి. దాదాపు నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళితే తప్ప గుహకు చేరుకోలేము. వైష్ణోదేవి గుడికి ట్రెక్‌ మొదల్యే కట్రా టౌన్‌ నుంచి శివఖోరికి వెళ్లవచ్చు.

లేదా అఖనూర్‌ మీదుగా రాజోరి వెళ్లే దారిలోఖండామోర్హా జంక్షన్‌ తగులుతుంది. అక్కడ్నుంచి కూడా రణసు గ్రామానికి వెళ్లొచ్చు. ఇప్పుడంటే రోడ్లు వేశారు కానీ ఒకప్పుడు అయితే గుహకు చేరుకోవడం దుర్లభంగా ఉండేది. కట్ర నుంచి రణసుకు వెళ్లే మార్గం కూడా కఠినంగా ఉంటుంది. సుమారు 70 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులోనే ప్రయాణించాలి. అప్పుడు రణసుకు చేరుకుంటాం. పేరుకది టౌనే కానీ ఊరులాగే ఉంటుంది. అక్కడ ఉండటానికి లాడ్జ్‌లు గట్రాలేవీ ఉండవు. దొరికింది తినేసి నడక మొదలు పెట్టాలి. నాలుగు కిలోమీటర్లు నడుస్తూనే ఉండాలి. నడవడం చాతకాని వాళ్లు గుర్రాల మీద వెళ్లవచ్చు. వయో వృద్ధుల కోసం డోలీలు దొరుకుతాయి. గుహ అంతర్భాగం నుంచి పాక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అంతర్భాగం అంటే చిన్నగా ఉంటుందనుకునేరు! ఒకేసారి 300 మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. అంత విశాలంగా ఉంటుంది.

అక్కడ్నుంచి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పాక్కుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నాను కదా! కొన్ని చోట్ల పొట్ట నేలకు ఆనించి మరీ పాకవలసి వస్తుంది. అంత శ్రమపడితే వెళితే వెడల్పాటి గుహ దగ్గరకు చేరుకుంటాం! అక్కడి ఆ అద్భుత దృశ్యాలను చూస్తే అప్పటి వరకు పడిన కష్టం అంతా మాయమవుతుంది. పార్వతీదేవి, గణపతి, నారదుడు, పరమశివుడి ఝటాఝూటం, పద్మం, ఆదిశేషుడు ఇలా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన దేవిదేవతా మూర్తులు సాక్షాత్కరిస్తాయి. అక్కడ్నుంచి ఇంకొంచెం దూరం లోపలికి వెళితే రెండు దారులు కనిపిస్తాయి. ఏ దారిలో వెళ్లాలనే ఆయోమయం అక్కర్లేకుండా అక్కడున్న సెక్యూరిటీ గార్డులు మనల్ని గైడ్‌ చేస్తారు. మొదటిదారిలో ఎంట్రీ లేదు కాబట్టి రెండో దారిలోంచే మనం వెళ్లాలి. 200 మీటర్ల పొడవు, మూడు మీటర్ల ఎత్తు, ఒక మీటర్‌ వెడల్పుతో ఉన్న ఈ గుహలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతాం! శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

గుహలోపలికి వెళితే నాలుగు అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కనిపిస్తుంది. ఆ లింగాన్ని నిరంతరం అభిషేకిస్తున్న పాలరంగులో ఉండే జలధార మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆ క్షీరధారనే ధూద్‌గంగ అంటారు.. మహేశ్వరుడి దర్శనం తర్వాత అలౌకిక ఆనందం కలుగుతుంది. అప్పటి వరకు పడిన కష్టమంతా మంత్రించినట్టు మాయమవుతుంది. అన్నట్టు శివఖోరికి ఓ స్థలపురాణం ఉంది. భస్మాసురుడి కథ అందరికీ తెలిసిందే. ఆయన గొప్ప శివభక్తుడు. మరణం లేకుండా ఉండటానికి పరమశివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. తాను ఎవరి తలపై చేయిపెడితే వారు భస్మం కావాలని కోరుకుంటాడు. శివుడు తథాస్తూ అంటాడు. శివుడు ఇచ్చిన వరాన్ని ఆయనపైనే ప్రయోగించి చూడాలనుకుంటాడు భస్మాసురుడు. శివుడి నెత్తిన చెయ్యి పెట్టాలని చూస్తాడు. భస్మాసురుడిని తప్పించుకుని పారిపోతూ శివుడు ఈ గుహల్లో దాక్కున్నాడు.

శివఖోరి స్థలపురాణం ఇది! ఈ గుహ నుంచి రెండు సొరంగ మార్గాలున్నాయి. ఒకటేమో స్వర్గానికి వెళుతుందట! నిజంగానే స్వర్గానికి దారి ఉందో లేదో తెలియదు కానీ చాలా మంది అమరలోకానికి వెళ్లాలనే కోరికతో ఆ దారి వెంట వెళ్లారు. వెళ్లినవారెవ్వరూ వెనక్కి తిరిగి రాలేదు. ఇప్పుడా సాహసం ఎవరూ చేయరు. అసలు ఈ సొరంగం నుంచి వెళ్లడాన్ని నిషేధించారు కూడా! మరో మార్గం నుంచి వెళితే అమర్‌నాథ్‌ ఆలయానికి చేరుకుంటామట! కొందరు సాధువులు ఈ ప్రయత్నం కూడా చేశారట! ఈ మార్గాన్ని కూడా మూసేశారు. ఆషాడపౌర్ణమి నుంచి శ్రావణ పున్నమి వరకు అమర్‌నాథ్‌లో పూజలందుకునే శివుడు మిగతా సమయంలో ఈ గుహలోనే ఉంటాడట! అందుకే స్థానికులు ఈ క్షేత్రాన్ని బూఢా అమర్‌నాథ్‌ అని పిలుచుకుంటారు. ఈ ఆలయంలో కనిపించే మరో అద్భుతమేమిటంటే పావురాళ్లు. చుట్టుపక్కల ఎక్కడా కనిపించని పావురాళ్లు కేవలం ఈ గుహలో మాత్రమే కనిపిస్తాయి. ఆ పావురాళ్ల సంఖ్య పెరగదు. తగ్గదు. వేల సంవత్సరాలుగా సంఖ్య అంతే ఉంటోంది. మహా శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది.

Updated On 7 March 2024 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story