రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుమూశారు. ఆయన వయసు 86. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మానోహర్ జోషికి వృద్యాప్య సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. మనోహర్ జోషి మరణ వార్తను పీడీ హిందూజా హాస్పిటల్ యాజమాన్యం ధృవీకరించింది. ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
మహారాష్ట్రలోని మహద్‌లో 1937 డిసెంబర్ 2న మనోహర్ జోషి జన్మించారు. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన వీరమాత జీజాబాయి టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. మనోహర్ జోషి సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ ఉన్నారు. మనోహర్ జోషి మృతి పట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.