మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలన్నదానిపై కూటమి ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో కనీస మెజారికీ కావాల్సిన సంఖ్య 145. బీజేపీకి సొంతంగా 132 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన (షిండే) పార్టీ నుంచి 57 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ తరపున 41 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీజేపీ చెబుతున్నదేమిటంటే ముఖ్యమంత్రి పదవిని తమకు ఇచ్చేసి, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు తీసుకోమని అంటోంది. మొన్నటి వరకు ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ అవసరం కాబట్టి షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పడ్నవీస్‌కు షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉంటే నష్టమేమీ లేదన్నది బీజేపీ వాదన. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆనందంగా తీసుకుంటానని అజిత్ పవార్ అంటున్నారు. కాకపోతే షిండేనే ఇంకా ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా పని చేసి తర్వాత ఉప ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో చేసిన సందర్భాలు ఎక్కువే! కానీ షిండే వాదన మరో రకంగా ఉంది. శివసేనను చీల్చినప్పుడు తనను ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా తనకే ఆ పదవిని ఇవ్వాలని అంటున్నారు. పాపం బీజేపీ సంగతి తెలియక షిండే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారు. ఉద్ధవ్ థాక్రే ఇలా అడిగినందుకు ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు షిండే దగ్గర కాంప్రమైజ్ తప్ప మరో ఆప్షన్ లేదు. మరోవైపు శివసేన (షిండే) నాయకుడు సంజయ్ శిర్సట్ కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రికే హోం మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు.ముఖ్యమంత్రే హో మంత్రి పదవి నిర్వహించడం మంచిది కాదన్నారు. అంటే షిండే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీ పడినట్టేననుకోవాల్సిఉంటుంది. అయితే హోం శాఖను ఏక్‌నాథ్ షిండేకు ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం సుముఖంగా లేదని తెలిసింది. దాంతో షిండే అలిగారని, అన్నికార్యక్రమాలను రద్దు చేసుకుని తన స్వగ్రామానికి వెళ్లిపోయారని అంటున్నారు. ఎంతగా అలిగినా , ఎంత బెట్టు చేసినా షిండేకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. బీజేపీ చేయాల్సింది చేసేస్తుంది. తన దగ్గర 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని షిండే అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు కానీ, అవసరం పడితే ఇందులోంచి మరో షిండేను పుట్టించడం బీజేపీకి చాలా ఈజీ. శివసేన (షిండే)ను తమ పార్టీలో విలీనం చేసుకున్నాఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.