శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ గాలి కబురు చెప్పాగానే దేశం ఒలిక్కిపడింది. ఆ తర్వాత అది అవాస్తవమని తెలియగానే చాలా మంది ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం మొదలయ్యింది. శబరిమల ప్రసాదం(Sabarimala prasadam) అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయం(Sabarimala Ayyappa Temple)లోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా ఉంది. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో వీటి వాడకాన్ని నిలిపివేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టీడీబీ(TDB) దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌ను ఇండియన్ సెంట్రిఫ్యుజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్(Indian Centrifuge Engineering Solutions) పొందిందని, వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీబీ చైర్మన్ ప్రశాంత్(TDB Chairman Prashanth) తెలిపారు.