మానవాళిని వైరస్‌ను(Virus) నిద్రపట్టకుండా చేస్తున్నాయి. గజ గజ వణికిస్తున్నాయి.
మానవాళిని వైరస్‌ను(Virus) నిద్రపట్టకుండా చేస్తున్నాయి. గజ గజ వణికిస్తున్నాయి. ఓ వైరస్ కనుమరుగయ్యిందని ఊపిరిపీల్చుకునే అవకాశం కూడా లేకుండా మరో వైరస్ దాడి చేస్తున్నది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో చాందీపురా వైరస్(Chandipura virus) కలకలం రేపుతోంది. ఒక్క గుజరాత్‌లోనే 32 మందిని ఈ వైరస్ పొట్టనపెట్టుకుంది. అక్కడ ఈ వైరస్ కేసులు 84కు చేరినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రుషికేశ్ పటేల్(Rushikesh patel) తెలిపారు. సబరకాంత జిల్లాలో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. వేరే రాష్ట్రాల నుంచి గుజరాత్‌కు వచ్చిన ముగ్గురు వైరస్ బారినపడ్డారని, ఇతర రాష్ట్రాలలోనూ వైరస్ వ్యాప్తి చెందిందని రుషికేశ్ పటేల్ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో వైరస్ సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ ఇప్పటిదేమీ కాదు. 1965లో మహారాష్ట్రలోని చాందీపురాలో మొదటిసారి ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలుడు ఈ వైరస్‌తో చనిపోయాడు. చాందీపురాలో వెలుగు చూసింది కాబట్టి ఈ వైరస్‌ను చాందీపురా అంటున్నారు. ఈగలు, కీటకాలు, దోమల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ఈడిస్ రకం దోమల నుంచి వ్యాప్తి చెందుతున్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి గుజరాత్‌లో 15 లోపు పిల్లల్లో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారికి జర్వరం వస్తుంది. విరేచనాలు అవుతాయి. ఫ్లూ వంటి లక్షణాలతో మెదడువాపు వ్యాధికి గురవుతారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుక్కోలేదు. అందుకే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు లేకుండా చూసుకోవాలి. పిల్లలకు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాలి.