రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది. ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మాదిరి భద్రత లభించనుంది. హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను Z Plus నుండి ASL (అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్)కి పెంచింది. ఇప్పటి వరకూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది.

మోహన్ భగవత్ భద్రతలో అలసత్వాన్ని గుర్తించిన హోం మంత్రిత్వ శాఖ.. కొత్త భద్రతా ప్రోటోకాల్‌లపై పనిచేయడం ప్రారంభించిందని.. భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికల్లో పేర్కొన్నాయి.

అనేక భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయని నిఘా సంస్థ‌ల‌కు స‌మాచారం ఉంది. దీంతో భద్రతను పెంచేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ సమాచారం అందించారు. కొత్త భద్రత ప్రకారం.. మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో అప్పటికే CISF బృందాలు ఉంటాయి.

మోహన్ భగవత్‌కు జూన్ 2015లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. Z-Plus భద్రతలో 10 మంది NSG కమాండోలతో సహా 36 మంది భద్రతా సిబ్బంది ఉంటారు.

ASL కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ హాజ‌ర‌వ‌బోయే ప్రదేశానికి.. సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి అప్పటికే ఒక బృందం వెళ్తుంది. మోహన్ భగవత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఆ కార్యక్రమానికి వెళ్తారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story