అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకుని ఆరు నెలలైనా కాలేదు. అప్పుడే ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజ్‌ అవుతున్నదట!

అయోధ్య(Ayodhya)లో రామమందిరం(rammandir) ప్రారంభోత్సవం జరుపుకుని ఆరు నెలలైనా కాలేదు. అప్పుడే ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజ్‌ అవుతున్నదట!ఇది నిజమేనని ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్‌ స్పష్టం చేశారు. చిన్నపాటి వర్షానికే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతున్నదని ఆయన చెప్పారు. రామ్‌లల్లా విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నీరు లీక్‌ అవుతున్నదని తెలిపారు. దీంతో ఆలయ నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. నీళ్ల లీకేజీ అన్నది సాధారణ విషయం కాదని, తీవ్రమైన సమస్య అని సత్యేంద్రదాస్‌ అన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిర్మాణంలో లోటుపాట్లను తెలుసుకోవడంపై దృష్టి సారించాలని, ఒకటిరెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపించాలని అన్నారు. వర్షాలు పెరిగితే పూజలు చేయడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రామ మందిరానికి వాటర్‌ డ్రైనేజీ మార్గం లేదని, పై నుంచి నీరు లీకేజీ అయిన తర్వాత అవి బలరాముడి విగ్రహం ఉన్న చోటు వద్దకు చేరుకుంటున్నాయని చెప్పారు. మరోవైపు వచ్చే ఏడాది జూలై నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని సత్యేంద్రదాస్‌ తెలిపారు. ఒకవేళ గడువులోగా నిర్మాణం పూర్తి అయితే మంచిదేనని, కాని చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తి కాక ముందే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాల నుంచి ప్రముఖులంతా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో తిలకించడానికి కార్యాలయాలకు సగం రోజు సెలవు కూడా ఇచ్చారు. మొన్నటి ఎన్నికలలో బీజేపీ రామమందిరాన్ని ప్రచారానికి కూడా వాడుకుంది.

Eha Tv

Eha Tv

Next Story