మనసు వెలిగితే రాముడు(Ramudu).మనిషి ఎదిగితే దేవుడు. ధర్మసంస్థాపన కోసం మాధవుడే మనిషిగా అవతరించాడు. పరిపూర్ణ మానవుడంటే ఇలా వుండాలని లోకానికి చాటి చెప్పాడు. ఆయన నడిచే ధర్మం. మూర్తీభవించిన ఆదర్శానికి ఆయన ప్రతీక. త్రేతాయుగం నాటి రాముణ్ణి ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నామంటే కారణమదే! వాగ్గేయకారులు రామదాసు, త్యాగరాజు రామసుధారసగానము చేసి తరించారు. ఆ వాగ్గేయకారులే కాదు.మన తెలుగు సినీ కవులు కూడా సందర్భమొచ్చినప్పుడుల్లా ఆ పరంధాముడిని సందర్భోచితంగా , ఆనందకరంగా అభివర్ణించారు. రామాయణంలాగే వాటికి కూడా కాలదోషం పట్టలేదు. ఇప్పటికి అవి నిత్య నూతనంగా వెలుగొందుతున్నాయి.

మనసు వెలిగితే రాముడు(Lord Ram).మనిషి ఎదిగితే దేవుడు. ధర్మసంస్థాపన కోసం మాధవుడే మనిషిగా అవతరించాడు. పరిపూర్ణ మానవుడంటే ఇలా వుండాలని లోకానికి చాటి చెప్పాడు. ఆయన నడిచే ధర్మం. మూర్తీభవించిన ఆదర్శానికి ఆయన ప్రతీక. త్రేతాయుగం నాటి రాముణ్ణి ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నామంటే కారణమదే! వాగ్గేయకారులు రామదాసు, త్యాగరాజు రామసుధారసగానము చేసి తరించారు. ఆ వాగ్గేయకారులే కాదు.మన తెలుగు సినీ కవులు కూడా సందర్భమొచ్చినప్పుడుల్లా ఆ పరంధాముడిని సందర్భోచితంగా , ఆనందకరంగా అభివర్ణించారు. రామాయణంలాగే వాటికి కూడా కాలదోషం పట్టలేదు. ఇప్పటికి అవి నిత్య నూతనంగా వెలుగొందుతున్నాయి. అలాంటి వాటిల్లో వాగ్దానం(Vagdanam) చిత్రంలోని సీతాకళ్యాణ సత్కథ(Sita Kalyana satkatha) అనే హరికథ ఒకటి! 1961లో వచ్చిన ఈ సినిమాను కవితా చిత్ర బ్యానర్‌పై కె.సత్యనారాయణ, డి.శ్రీరామమూర్తి నిర్మించారు. మనసు కవి ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఏకైక సినిమా ఇది! బెంగాలీ రచయిత శరత్‌బాబు రాసిన దత్త నవలకు తెరరూపమే వాగ్దానం సినిమా! పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం పాటలను వినసొంపు చేసింది.
ముందు సీతాకళ్యాణ సత్కథ సాహిత్యాన్ని పరికిద్దాం..

గానం :
శ్రీనగజా తనయం సహృదయం
శ్రీనగజా తనయం సహృదయం
చింతయామి సదయం
త్రిజగన్మహోదయం
శ్రీనగజా తనయం
వచనం:
శ్రీరామ భక్తులారా, ఇది సీతా కల్యాణ సత్కథ. నలభై రోజులనుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా! కాస్త పాలూ మిరియాలు ఏవన్నా.!
శిష్యుడు: చిత్తం, సిద్ధం
వచనం:
భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందర్నీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి, ఆహా! అతడెవరయ్యా అంటే..
గానం:
రఘు రాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు
రమణీయ... వినీల... ఘన శ్యాముడు
వాడు నెలరేడు, సరిజోడు, మొనగాడు
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు, మరో మరుడు, మనోహరుడు
రఘూ రాముడూ…
స్వరం: సనిదని, సగరి గరిగరిరి, సగరిరిగరి, సగగరి సనిదని,
సగగగరి సనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస, సనిరిస నిదని, నిదసని దపమ గామాదా
నిని నిని నిని నిని
పస పస పస పస
సపా సపా సపా
తద్దిం తరికిటతక
రఘు రాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు..
శభాష్, శభాష్
వచనం:
ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామ చంద్ర మూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
గానం: ఎంత సొగసుగాడే
ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే
ఎంత సొగసు గాడే
మోము కలువ రేడే
నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే
ఎంత సొగసుగాడే..
వచనం: ఇక్కడ సీతాదేవి యిలా పరవశయై యుండగా, అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి..
గానం: అనియెనిట్లు ఓ యనఘులార
నా యనుగు పుత్రి సీత
వినయాదిక సద్గుణవ్రాత
ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన
ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి
మల్లెల మాలవైచి పెండ్లాడూ.. ఊ..
వచనం: అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే, సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడి పోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహా పాపము అని అనుకొనినవాడై వెనుతిరిగి పోయాడట. తదనంతరంబున -
గానం: ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత
తేటగీతి: ఫెళ్ళుమనె విల్లు ఘటలు ఘల్లుమనె, గు
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె
జానకీ దేహము ఒక నిమేషమ్మునందె
నయము జయమును భయము, విస్మయము గదురా.. ఆ..ఆ..
శ్రీమద్రమారమణ గోవిందో హరి!
వచనం: భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది. మరొక్కసారి -
జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట
కంద పద్యం: భూతలనాథుఁడు రాముఁడు
ప్రీతుండై పెండ్లియాడె పృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్ సీతన్‌
భూతలనాథుఁడు రాముఁడు ప్రీతుండై పెండ్లియాడె..
శ్రీ మద్రమారమణ గోవిందో హారి

ఈ తరానికి హరికథలు(Harikatha), బుర్రకథలు(Burrakatha) పెద్దగా తెలియవు కానీ ఆనాటి జనజీవితంలో ఇవే భాగం. అందుకే తెలుగు సినిమాలలో అప్పుడప్పుడు హరికథలు, బుర్రకథలకు చోటు దక్కేది. అయితే హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు బాణీలో కంటే పెద్దింటి భాగవతార్‌ బాణీలోనే సినిమా హరికథలు తయారయ్యేవి. విజయావారు తీసిన మొదటి సినిమా షావుకారు సినిమాలో సముద్రాల రాఘవాచార్య రచించిన శ్రీలు చెలంటే అనే హరికథనే తొలి తెలుగు సినీ హరికథ. ఆ తర్వాత బంగారుపాప, కలెక్టర్‌ జానకి, ఓ సీత కథ, అందాలరాముడు, ఇంటింటి రామాయణం, స్వాతిముత్యం వంటి సినిమాలలో హరికథలు ఉన్నాయ. ఇన్నేసి హరికథలు వచ్చినా వాగ్దానం సినిమాలోని హరికథకు దక్కిన గౌరవమర్యాదలు మరే కథకు దక్కలేదు.

ఈ హరికథను రచించినది మహాకవి శ్రీశ్రీ(Mahakavi Sri Sri). విప్లవకవి, నాస్తికుడు అయిన శ్రీశ్రీ ఈ హరికథను రాశారంటే చాలా మందికి నమ్మకం కుదరదు కానీ ఆయన మహా పండితుడు. శ్రీశ్రీ ఏమైనా రాయగలరు. శ్రీశ్రీ కేవలం విప్లవసాహిత్యమే రాయగలరనుకునే వారు ఈ హరికథను చూసి ముక్కున వేలేసుకున్నారు. శ్రీశ్రీకున్న పాండిత్యాన్ని, ప్రకర్షనను ఆకర్షణీయంగా చూపించిన ప్రక్రియ ఇది! దీన్ని ఆలపించినది ఘంటసాల మాస్టారు. తెరపై అభినయించినది రేలంగి. ఫిడేలుతో సూర్యకాంతం, మద్దెలతో పద్మనాభం కూడా కనిపిస్తారు. గుమ్మడి, నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao), కృష్ణకుమారి కూడా కనిపిస్తారు.
తెలుగు సినిమా సాహిత్య చరిత్రలో ప్రామాణికమైన విలువల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ హరికథ ప్రథమ పంక్తిలో నిలిచి తీరుతుంది. అయితే ఈ రచనలో రెండు ఖండికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫెళ్లుమనే విల్లు దగ్గర నుంచి విస్మయము గదరా వరకు గల సాహిత్యం కరుణశ్రీ ది! ఈయన రాసిన హృదయశ్రీ అనే కావ్యంలో గల ధనుర్భంగము అనే ఖండిక నుంచి యథాతథంగా వాడుకున్నారు. అలాగే చివరన వచ్చే భూతలనాథుడు రాముడు దగ్గరనుంచి భాగ్యోపేతన్‌ సీతన్‌ వరకు గల కందపద్యం పోతన రాసిన భాగవతంలోనిది. అలాగే వినాయక స్తుతితో మొలయ్యే శ్రీనగజా తయనం అనే శ్లోకం మనం ఎప్పట్నుంచో వింటూ వస్తున్నదే!
పెండ్యాల నాగేశ్వరరావు తన అజరామర సంగీతంతో హరికథకు ప్రాణప్రతిష్ట చేశారు. ఆయన శ్రీనగజా తనయం నుంచి త్రిజగన్మహోదయం వరకు కానడ రాగంలో స్వరపరిచారు. రఘురాముడు దగ్గర నుంచి స్వరాలతో సహా వచ్చే రమణీయ వినీల ఘనశ్యాముడు వరకు శంకరాభరణంలో బాణీ కట్టారు, ఎంత సొగసుగాడే దగ్గర నుంచి నామది వివశమాయె నేడే వరకు మోహనరాగాన్ని, అనియెనిట్లు ఓ యనఘురాలా దగ్గర నుంచి మల్లెల మాలవైచి పెండ్లాడు వరకు ధన్యాసి రాగాన్ని, ఇనకుల తిలకుడు దగ్గర నుంచి గదురా వరకు కేదారగౌళ రాగాన్ని, చివరనగల భూతలనాథుడు అనే పద్యానికి మళ్లీ శంకరాభరణాన్ని ఉపయోగించారు. ఇలా శ్రీశ్రీ, పెండ్యాల, ఘంటసాల వంటి మహామహుల సాంగత్యంతో ఈ హరికథ నిత్యనూతనంగా భాసిల్లుతోంది.

Updated On 6 Jan 2024 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story