పునర్జన్మలుంటాయని(reincarnation) ప్రతి మతగ్రంథమూ చెబుతున్నది.

పునర్జన్మలుంటాయని(reincarnation) ప్రతి మతగ్రంథమూ చెబుతున్నది. ఆత్మకు చావు ఉండదని గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పినట్టుగానే చాలా మంది ప్రవక్తలు ఈ మాట చెప్పారు. పునర్జన్మ వట్టి ట్రాష్‌ అంటారు సైన్స్‌ను నమ్మేవాళ్లు. కానీ అలాంటి శాస్త్రవేత్తలకే శాంతిదేవి(Shantidevi) అనే ఓ మహిళ సవాల్‌ విసిరింది. ఏమిటామె కథ అంటే .. 1926, డిసెంబర్‌ 11న ఢిల్లీలో జన్మించింది శాంతిదేవి(shantidevi). నాలుగేళ్ల వయసులో పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం మొదలు పెట్టింది. తన అమ్మనాన్నలు వేరే ఉన్నారని చెబుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదనేసింది. తనకు భర్త, పిల్లలు ఉన్నారని ఏదేదో చెప్పసాగింది. మొదట్లో శాంతిదేవి చెప్పేది తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు. చుట్టుపక్కలవాళ్లేమో శాంతిదేవికి మతిచలించిందని అనుకునేవారు. అయితే శాంతిదేవి చెప్పినదాంట్లో ఎంత వరకు నిజమున్నదో తెలుసుకోవాలనే ఆసక్తి కొందరికి కలిగింది. వారిలో కొందరు జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. డాక్టర్‌ కీర్తి స్వరూప్‌ రావత్‌ అనే ప్రముఖ మానసిక శాస్త్రవేత్తకు కూడా కుతూహలం కలిగింది. గత జన్మకు సంబంధించిన ఆనవాళ్లను ఇవ్వాల్సిందిగా శాంతిదేవిని వారు కోరారు. పోయిన జన్మలో తన పేరు లుగ్దీ(Ludgi) అని, భర్తతో కలిసి మధురలో ఉండేదానినని చెప్పి అడ్రస్‌ కూడా ఇచ్చింది. శాంతిదేవి వ్యవహరిస్తున్న తీరుతెన్నులను వివరిస్తూ ఆ అడ్రస్‌కు ఓ లేఖ రాశారు. వారి నుంచి వచ్చిన రిప్లైని చూసి షాకయ్యింది దర్యాప్తు బృందం. ఎందుకంటే శాంతి దేవి చెప్పిన విషయాలు ఆ కుటుంంతో సరిపోయాయట! శాంతిదేవి ఉండేది ఢిల్లీలో.. ఆమె ఉంటున్న చోటుకు 145 కిలోమీటర్ల దూరంలో మధుర ఉంటుంది. మధురకు శాంతి దేవి ఒక్కసారి కూడా వెళ్లింది లేదు. అయినప్పటికీ అక్కడి విషయాలను పొల్లుపోకుండా శాంతిదేవి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తన వాళ్లను కలవాలని ఆమె ఒకటే పోరు పెట్టడంతో వారిని మధుర నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. వారందరినీ శాంతిదేవి గుర్తించింది. భర్త పేరు కాంజి మాల్ చౌబే. ఆయన తన మూడో భార్యను వెంటపెట్టుకుని వచ్చాడు. గత జన్మలో చౌబేకు శాంతిదేవి రెండో భార్య. చౌబేకు కూడా సందేహమొచ్చింది. తమ ఇద్దరికే తెలిసిన కొన్ని సన్నిహిత ప్రశ్నలను శాంతిదేవిని అడిగాడు. వాటికి శాంతిదేవి సరైన సమాధానాలు ఇవ్వడంతో బిత్తరపోయాడా మనిషి. శాంతిదేవి తన భార్యేనని అంగీకరించాడు. ఆత్మ ఉందనడానికి, పునర్జన్మ ఉందనడానికి శాంతిదేవి కథనే పెద్ద ఉదాహరణ!

Eha Tv

Eha Tv

Next Story