గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్ అంటూ ట్వీట్!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(ratan tata) ఇక లేరన్న వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. టాటా అంటేనే భారతీయులకు చాలా ఇష్టం. రతన్ టాటా వ్యాపారవేత్తగానో, లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగానో ఇష్టపడటం లేదు. ఆయనలో ఓ మానవతామూర్తి ఉన్నారు. సామాన్యుల కోసం పరితపించే హృదయం ఆయనది. దేశం మొత్తం రతన్‌టాటాను స్మరించుకుంటోంది. కన్నీటి నివాళులర్పిస్తోంది. ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటున్న సమయంలో రతన్ టాటా ఓ యంగ్ ఫ్రెండ్‌తో కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ యంగ్ ఫ్రెండ్ మన తెలుగువాడే. పేరు శంతను నాయుడు. రతన్‌టాటాకు పెళ్లి కాలేదు. పిల్లాజెల్లా లేరు. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు తన జంతుప్రేమ, మానవత్వంతో రతన్‌టాటాను ఆకర్షించాడు. అతడే శంతను. తనకు తోడుగా, సహాయకుడిగా ఆ శంతనును నియమించుకున్నారు రతన్ టాటా. మహారాష్ట్రలోని పూణేలో ఉంటున్న ఓ తెలుగు కుటుంబంలో 1993 లో శంతను నాయుడు జన్మించాడు. అతడి తండ్రి టాటా మోటార్స్ లో పనిచేసాడు. స్కూల్ చదువంతా పూణెలోనే సాగింది. అక్కడే ఉన్న సావిత్రబాయి పూలే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి ఎంబిఏ పూర్తిచేసాడు. ఆ తర్వాత టాటా సంస్థలో ఉద్యోగంలో చేరాడు. టాటా ఎల్క్సీ లో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్ గా పనిచేసాడు శంతను నాయుడు. రతన్‌టాటాకు జంతువులంటే ఇష్టం. వాటి పట్ల కరుణ చూపేవారు. శంతను కూడా జంతు ప్రేమికుడే కాబట్టి ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. తన హోదాను సైతం పక్కనబెట్టి శంతనుతో స్నేహం చేశారు రతన్ టాటా! జంతువుల పట్ల ప్రేమను కనబరుస్తూ శంతను 'మోటో పా' పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించాడు. ఏ దిక్కు లేకుండా రోడ్లపై తిరిగే వీధికుక్కలను రక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాడు. వాహనాల కిందపడి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా కుక్కలను కాపాడేందుకు పరితపించాడు. వీధి కుక్కల మెడలో రిప్లెక్షన్ లైట్స్ తో కూడిన బెల్ట్ లను తొడగడం ప్రారంభించారు. దీంతో రాత్రి సమయాల్లో కుక్కలు వాహనదారులగా ఈజీగా కనిపించేవి. అలా చాలా ప్రమాదాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వీధి కుక్కలను గుర్తించి వాటికి శస్ర్త చికిత్సను మోటోపా అందించేది. ప్రమాదాల బారినపడ్డ వీధి కుక్కలకు కృత్రిమ అవయవాలను కూడా అమర్చేది. శంతనునాయుడు నిస్వార్థంగా చేస్తున్న జంతుప్రేమను చూసి రతన్‌టాటా ముగ్ధుడయ్యారు. శంతను స్టార్టప్ సంస్థలో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో రతన్‌టాటాను శంతను చాలా సార్లు కలవాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. అది పెరిగి పెద్దదయ్యింది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. శంతనుతో స్నేహం బాగా నచ్చిన రతన్ టాటా అతడిని తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. అప్పట్నుంచి రతన్ టాటా వెన్నంటే ఉంటూ వచ్చాడు శంతను. దేవుడికి ఈ స్నేహబంధాన్ని చూసి కళ్లు కుట్టినట్టుగా ఉంది. అందుకే రతన్‌టాటాను తీసుకెళ్లిపోయాడు. శంతను అయితే కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆయనతో కలిసి దిగిన ఓ పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌజ్ అంటూ భావోద్వేగ వ్యాఖ్యను చేశారు.
మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవ్వడం వల్ల కలుగుతోన్న దుఃఖం ఏమాత్రం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్ అని ట్వీట్ చేశారు శంతనునాయుడు.Ratan tata Young friend Shantanu naidu emotional good bye about his death