బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అద్బుల్ మతీన్ అహ్మద్ తాహా లను కోల్‌కతా సమీపంలో గుర్తించారు. వారి రహస్య స్థావరాన్ని గుర్తించి, NIA బృందం పట్టుకుంది. షాజిబ్ కేఫ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ని ఉంచాడని విచారణలో తేలింది. పేలుడు ప్రణాళిక, అమలు వెనుక తాహా ప్రధాన సూత్రధారి అని అధికారులు తెలిపారు.
కర్ణాటకలో 12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట ఇలా మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో తనిఖీల అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తికి స్థానికంగా సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఎన్‌ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్ర పోలీసు ఏజెన్సీల మధ్య సమన్వయం, సహకారంతో ఈ అరెస్టులు జరిగాయని ఎన్.ఐ.ఏ. అధికారి తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసేందుకు దారితీసే సమాచారం ఇచ్చిన వారికి ఎన్‌ఐఏ గత నెలలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. మార్చి 1న బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని ఐటీపీఎల్ రోడ్‌లో ఉన్న కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. మార్చి 3న ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది.