✕
శ్రీరామకథ. ఎన్నిసార్లు ఆలించినా, ఎన్నిమార్లు దర్శించినా తనివితీరని దివ్యకథ అది. కన్నులవిందౌ పుణ్య కథ అది! ఆ గాధను ఎంత మంది ఎన్ని తీరులుగా రచించినా , ఎంత మంది ఎన్నిరకాలుగా ప్రదర్శించినా కొత్తగానే ఉంటుంది. అది ఆ కావ్య మహిమ! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందటే, శరన్నవరాత్రుల వేళ ఉత్తరభారతమంతా రామ్లీలా(Ram Leela) రామకథను ప్రదర్శిస్తారు కాబట్టి. రామాయణ సంగీత నాటక రూపకాన్ని జనం కూడా ఎంతో ఆసక్తితో అనురక్తితో వీక్షిస్తారు కాబట్టి.దసరాకు రాముడికి సంబంధం ఉంది.

x
Ram Leela
-
- శ్రీరామకథ. ఎన్నిసార్లు ఆలించినా, ఎన్నిమార్లు దర్శించినా తనివితీరని దివ్యకథ అది. కన్నులవిందౌ పుణ్య కథ అది! ఆ గాధను ఎంత మంది ఎన్ని తీరులుగా రచించినా , ఎంత మంది ఎన్నిరకాలుగా ప్రదర్శించినా కొత్తగానే ఉంటుంది. అది ఆ కావ్య మహిమ! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందటే, శరన్నవరాత్రుల వేళ ఉత్తరభారతమంతా రామ్లీలా(Ram Leela) రామకథను ప్రదర్శిస్తారు కాబట్టి. రామాయణ సంగీత నాటక రూపకాన్ని జనం కూడా ఎంతో ఆసక్తితో అనురక్తితో వీక్షిస్తారు కాబట్టి.దసరాకు రాముడికి సంబంధం ఉంది. రావణసంహారం అనంతరం శ్రీరాముడు జరుపుకున్న విజయవేడుకలే దసరా అంటారు. దస్హరా అంటే పది తలల రావణుడి అంతమన్నమాట! రామకథను తెలిపే రామ్లీలాను తులసీదాసు ప్రారంభించాడట! 16వ శతాబ్దపు అవధి భాషలో ఉన్న రామచరిత మానస్లు రామ్లీలాకు ఆధారం. ఆనాటి నుంచి నేటి వరకు రామ్లీలాను ప్రదర్శిస్తున్నారు.
-
- తులసీదాసు శిష్యగణంలో ఒకడైన మేఘ భగత్ క్రీస్తుశకం 1625లో రామ్లీలా ప్రదర్శనలు నిర్వహించాడని చెబుతుంటారు. అయితే ఈ ప్రదర్శనలు అప్పుడే ఆరంభం కాలేదనీ అంతకు ముందు కూడా రామ్లీలా జరిగిందనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. క్రీస్తుశకం 1200- 1500 మధ్య మొదటి సారి రామ్లీలా ప్రదర్శనలు జరిగాయట! మొగల్ చక్రవర్తి అక్బర్ కూడా రామ్లీలా ప్రదర్శనను తిలకించాడట! మొన్న ఆదివారంతో మొదలైన రామ్లీలా ప్రదర్శనలు ఈ నెల 25వ తేదీ వరకు జరుగుతాయి.వాల్మీకి రామాయణాన్ని వాడుక భాషలో అంటే అవధిలో రచించారు తులసీదాసు. ఆయన రాసిన రామాయణం జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది.అప్పటి నుంచే ఉత్తరాదిన రామ్లీలా ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు కొందరు. రామ్లీలా కేవలం ప్రదర్శనే కాదు. అదో సుసంపన్నమైన నాటక కళ. ఓ పండుగ! నాటక ప్రదర్శన అలా ఇలా ఉండదు.చాలా ఆర్భాటంగా ఉంటుంది.
-
- ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు స్థానిక జానపద గీతాలను నాటకంలో జొప్పిస్తారు. ఇందులో పనిచేసే కళాకారుల బృందాన్ని మండలి అంటారు. సంప్రదాయాలను విస్మరించకుండా పూర్తిగా జానపద శైలిలో ఈ పౌరాణిక నాటం సాగుతుంది. దాదాపు నెలరోజుల పాటు రాత్రుళ్లు ఆరుబయట ఈ ప్రదర్శనను నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులప్పుడు మరింత గొప్పగా సాగుతుందీ రామ్లీలా! ఈ నాటకాన్ని ప్రదర్శించే ప్రాంతాన్ని బారస్ అంటారు. వర్ధమాన కళాకారులంతా ఇందులో పాల్గొనేందుకు ఉత్సుకత చూపిస్తారు. తమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడానికి ఉబలాటపడతారు.మన సురభి వారిలా నాటకంలో టెక్నికల్ వాల్యూస్ ఉండకపోయినా జనం మాత్రం ఆసక్తిగా చూస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉంటాయి.. జనాదరణ ఏ మాత్రం తగ్గకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది.
-
- అందుకే రామ్లీలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ మాట ఎందుకన్నానంటే ఉత్తర మధ్య భారతావనిలోనే కాదు. నేపాల్, పాకిస్తాన్, ఫిజి, మారిషస్, దక్షిణాఫ్రికా, గయానా, సూరినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా రామ్లీలా ప్రదర్శనలు జరుగుతున్నాయి. రామ్లీలా ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతం ఓ తిరునాళ్లను తలపిస్తుంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు బళ్లు కట్టుకుని మరీ రామ్లీలాను తిలకించడానికి వస్తారు. నాటక ప్రదర్శనలకు అయ్యే ఖర్చునంతా ప్రజలే భరిస్తారు. ముస్లింలు కూడా పెద్దపెట్టున విరాళాలు ఇస్తారు. ప్రదర్శనను ఆసక్తిగా చూస్తారు. మానవజాతి మౌఖిక వారసత్వ సంపదగా రామ్లీలాను యునెస్కో గుర్తించింది. అదో అద్భుత కళాఖండమంటు కితాబిచ్చింది.
-
- రామ్లీలాపై బోలెడన్ని డ్యాకుమెంటరీలను, లఘుచిత్రాలను రూపొందించారు. కొన్ని చోట్ల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వంటి ప్రముఖ పాత్రలను ముస్లిం యువకులు ధరిస్తున్నారు. మత సామరస్యానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏమంటుంది..? రామ్లీలా ప్రదర్శనల చివరి రోజున అంటే విజయదశమి రోజున రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలను తయారు చేస్తారు.వాటిల్లో బాణాసంచా నింపుతారు. వాటిని ఆరుబయట ఉంచుతారు. రాముడి వేషంలో ఉన్న నటుడు రావణుడి నాభిని గురి చేసి అగ్నిబాణం వేస్తాడు. ఆ మంటలకు దిష్టిబొమ్మలు దగ్ధమవుతాయి. ప్రేక్షకుల ఆనందోత్సహాలు అంబరాన్ని అంటుతాయి. సీతదేవిని రక్షించి రాముడు తన రథం మీద తీసుకెళ్లే సన్నివేశంతో నాటకం పరిసమాప్తమవుతుంది. కరతాళధ్వనులతో, కేరింతలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. ఇవీ స్థూలంగా రామ్లీలా విశేషాలు.

Ehatv
Next Story