అమ్మలోని అ-నాన్నలోని న కలిస్తేనే అన్న. అన్నంటే అంతులేని అనురాగం. అమ్మ కురిపించే ఆప్యాయత. నాన్న కల్పించే భద్రత అన్నలు తమ చెల్లెళ్లకు కల్పిస్తారు. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే, ఆ ప్రేమతోనే, ఆ అభిమానంతోనే శ్రావణ పౌర్ణమి(Sravana Pournami) రోజున చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఆచారాలలో రక్షాబంధన(Rakshabandhan) మహోత్సవం ఒకటి. రక్షాబంధనమనేది అన్నాచెల్లెళ్ల(Brother-Sister) పండగే కాదు. అక్కా తమ్ముళ్లది! ప్రేమ ఆప్యాయతలున్నవాళ్లది.ఒకరికొకరు తోడుగా ఉండాలనుకునే వాళ్లది.
అమ్మలోని అ-నాన్నలోని న కలిస్తేనే అన్న. అన్నంటే అంతులేని అనురాగం. అమ్మ కురిపించే ఆప్యాయత. నాన్న కల్పించే భద్రత అన్నలు తమ చెల్లెళ్లకు కల్పిస్తారు. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే, ఆ ప్రేమతోనే, ఆ అభిమానంతోనే శ్రావణ పౌర్ణమి(Sravana Pournami) రోజున చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. మానవ సంబంధాల్లో దివ్యత్వాన్ని నింపుకునే ఆచారాలలో రక్షాబంధన(Rakshabandhan) మహోత్సవం ఒకటి. రక్షాబంధనమనేది అన్నాచెల్లెళ్ల(Brother-Sister) పండగే కాదు. అక్కా తమ్ముళ్లది! ప్రేమ ఆప్యాయతలున్నవాళ్లది.ఒకరికొకరు తోడుగా ఉండాలనుకునే వాళ్లది.
ఒకప్పుడు పైశాచిక శక్తుల నుంచి పరిరక్షణ కోసం రక్షాబంధనం కట్టుకునేవారు. పురాణాలు చెప్పేది కూడా ఇదే! రాక్షసరాజుతో జరుగుతున్న మహా సంగ్రామంలో దేవేంద్రుడు(Lord Indra) ఓటమి అంచుకు చేరుకుంటాడు. అప్పుడు గురువు బృహస్పతి(Brihaspathi) సలహాతో ఇంద్రాణి శచీదేవి(Sachidevi) శ్రావణపూర్ణిమ రోజున భర్త అయిన దేవేంద్రుడికి రక్షాబంధనం కడుతుంది. ఆ స్ఫూర్తితో ఇంద్రుడు విజయం సాధిస్తాడు. కృష్ణుడి(Lord Krishna) సలహా మేరకు ధర్మరాజు తన సోదరులతో రక్షాబంధనం ఒక క్రతువులా నిర్వహించేవాడని భారతంలో(Mahabharath) ఉంది. నిజానికి ఇది ఉత్తరాది పండుగే అయినా క్రమంగా దక్షిణభారతంలోనూ ప్రాచుర్యం పొందింది. అయితే మన పురాణాలు మాత్రం ఇది భారతీయులందరి పర్వంగా చెబుతున్నాయి. బొట్టు పెట్టి, హారతి ఇచ్చి పూజించిన రాఖీని కుడి చేతి మణికట్టుకు కట్టడం సంప్రదాయం.
ధర్మం కోసం పోరాడే వ్యక్తికి విజయం చేకూరాలని కోరుతూ అతడి శ్రేయోభిలాషులు.. బంధుమిత్రులు, సన్నిహితులు రక్షను అతని చేతికి కట్టడం రక్షాబంధనంలో ఉన్న ప్రధాన అంశం. లోక రక్షణార్థం బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన వామనుడి శక్తిని రక్షలోకి ఆవాహన చేసి, ఆ రక్షను విజయం పొందాల్సిన వ్యక్తి చేతికి కట్టడమనేది సంప్రదాయంగా వస్తోంది. దీనికి తగినట్టుగానే రక్ష కడుతూ యేన బద్ధో బలీ రాజా, దానవేంద్రో మహాబల: తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల అనే శ్లోకాన్ని చదువుతారు. మహాబలుడైన బలిచక్రవర్తిని బంధించిన విష్ణు శక్తితో నిన్ను బంధిస్తున్నాను. అంటే రక్షణ కల్పిస్తున్నాను. ఓ రక్షాబంధనమా నీవు చెలించకూ అని ఈ శ్లోకం అర్థం.
అనంతర కాలంలో అంటే చరిత్రలో కూడా రక్షాబంధనానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే ఎన్నో గాధలు వినిపిస్తాయి. అలెగ్జాండర్ మనదేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు మహా పరాక్రమవంతుడైన పురుషోత్తముడు అడ్డుపడతాడు. పురుషోత్తముడి శౌర్యానికి, పోరాటపటిమకు భయపడిన అలెగ్జాండర్ అర్ధాంగి పురుషోత్తముడిని కలిసి తన భర్త ప్రాణాలు కాపాడమంటూ అతడికి రాఖీ కట్టి వేడుకుంటుంది. అలెగ్జాండర్‌తో మల్లయుద్ధానికి దిగిన పురుషోత్తముడు శత్రువు ప్రాణాలు తీసే అవకాశం కలిగినా తన చేతికి కట్టిన రాఖీ కారణంగా అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు.
దీనికి విరుద్ధమైన కథ కూడా వినిపిస్తుంటుంది. అలెగ్జాండరే పురుషోత్తముడిని ఓడించి ఖైదు చేయిస్తాడు. అప్పుడు పురుషోత్తముడి భార్య సంయుక్త అలెగ్జాండర్ చేతికి రక్షాబంధనం కట్టింది. అలెగ్జాండర్ ఆమెను సొంత చెల్లెలుగా భావించి ఆదరించి పురుషోత్తముడిని విడుదల చేస్తాడు. అంతే కాకుండా సంయుక్తకు చీరసారెలు, అమూల్య రత్నాభరణాలు ఇచ్చి సాగనంపుతాడు. అసలు కథ ఏమైనప్పటికీ, చరిత్రకు వీటికి పొసగనప్పటికీ రక్షాబంధనంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవడమే ఈ గాథల ప్రధాన ఉద్దేశం.
రాఖీ(Rakhi) వ్యక్తికి, సమాజానికి ఉన్న నిర్మోహమైన ప్రేమను వ్యక్తపరుస్తుంది. సమాజాన్ని వ్యక్తి రక్షిస్తే... వ్యక్తి సామాజిక రక్షణకు పాటుపడతాడు. రాఖీబంధనం వెనుక ఈ విధమైన అంత:సూత్రం కూడా ఉంది. అందుకే పూజ చేయాలి.. పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చేయాలి.. శ్రావణపూర్ణిమ రోజు సూర్యోదయకాలంలోనే(Early Morning) స్నానమాచరించాలి. కట్టబోయే రాఖీని దేవుడి ముందు ఉంచి పూజ చేయాలి. శ్రావణ పౌర్ణమిని కర్నాటకలో నారికేళ పున్నమి(Narikela Punnami) అంటారు. ఆ రోజు అక్కడ సాగర పూజ చేసి సముద్రుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పాల్కురికి సోమనాథుడు ఈ పున్నమిని నూలి పున్నమి అన్నాడు.
నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. రక్షాబంధనం రోజునే హయగ్రీవ జయంతి(Hayagriva Jayanthi) కూడా! వేదపహారియైన రాక్షసుడిని వధించి వేదాలను ఉద్ధరించిన హయగ్రీవుడు మహావిష్ణువు అవతారమే!
ఇది స్త్రీలు మాత్రమే కట్టాలన్న నియమేమిలేదు. ఎవరైనా కట్టవచ్చు. ఎవరికైనా కట్టవచ్చు. తల్లీబిడ్డలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, బంధువులు ఇలా ఒకరికి ఒకరు అండగా, రక్షగా నిలవాలన్నదే రక్షాబంధనం పవిత్ర ఉద్దేశం. రాఖీ పౌర్ణమి రోజు ఒడిశాలో ఆవులు, ఎద్దులకు అలంకరణ చేసి పూజిస్తారు. గుజరాత్‌లోనూ సముద్రానికి కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉంది. సముద్రానికి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మత్స్యకారులు చేపల వేటకు వెళతారు. ఉత్తరాన పవిత్రోవన పేరుతో శివుడికి అభిషేకాలు చేస్తారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల వ్యవసాయదారులు కబరీ పూర్ణిమ అని కూడా పిలుచుకుంటారు. శ్రావణ పౌర్ణిమ భారతీయ సంస్కృతిలో అత్యున్నతమైన పర్వదినం. ఎన్నో రంగుల రాఖీలతో అందరినీ అలరించే ఆత్మీయబంధానికి స్మృతి చిహ్నం. రక్షాబంధనం అనేది ఓ వేడుక కాదు. ఓ పండుగ కాదు. అది విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వజనీన ప్రేమకు ప్రతీక. కులమతాలతో సంబంధం లేకుండా ధనిక పేద తారతమ్యం లేకుండా భారతీయులందరూ ఒక్కటేననే ప్రాతిపదికపైనే రక్షాబంధన వేడుక జరుగుతుంది. సోదరీసోదరానుబంధానికి రక్షాబంధనమొక చిహ్నం. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఓ రూపం.. సమాజంలోని సంస్కృతీ సంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం రక్షకులమై నిలబడటానికి ఉపకరించేది రక్షాబంధనం. రక్ష కట్టుకోవడం ఒక ధార్మిక చర్యకు నిదర్శనం..