Rajya Sabha Polls : 12 రాజ్యసభ స్థానాలకు 3న ఉప ఎన్నిక.. ఫలితాలు ఎప్పుడంటే..
తొమ్మిది రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు( Rajya sabha bye elections) జరగనున్నాయి.
తొమ్మిది రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు( Rajya sabha bye elections) జరగనున్నాయి. ఎగువసభలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఎన్నికలపై ఎన్నికల సంఘం బుధవారం కార్యచరణ ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా సిట్టింగ్ సభ్యులు లోక్‌సభ ఎంపీలుగా ఎన్నికైన నేపథ్యంలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు.
తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటిలో హర్యానాలో మరోసారి ఎన్డీయే(NDA) వర్సెస్ ఇండియా కూటమి(INDIA) మధ్య గట్టి పోరు ఉండనుంది. మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. అందరి చూపు అక్కడి రాజ్యసభ ఉప ఎన్నికపై కూడా ఉంటుంది.
ఆగస్టు 14న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ. సెప్టెంబర్ 3న ఒక్కో రాజ్యసభ స్థానానికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించి.. ఫలితాలు సెప్టెంబర్ 3న వెల్లడికానున్నాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజ్యసభలో 10 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీలను రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫై చేసింది. ఖాళీ అయిన సీట్లలో అస్సాం(Assam), బీహార్(Bihar), మహారాష్ట్ర(Maharashtra)ల్లో రెండు, హర్యానా(Haryana), మధ్యప్రదేశ్(Madhya Pradesh), రాజస్థాన్(Rajasthan), త్రిపుర(Tripura)లో ఒక్కో సీటు ఉన్నాయి. తెలంగాణ, ఒడిశాలోని రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. కే.కేశవరావు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని వీడి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిజూ జనతాదళ్ ఎంపీ మమతా మొహంతా రాజ్యసభ స్థానానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం మొహంతా బీజేపీలో చేరారు.
12 రాజ్యసభ స్థానాలలో 7 స్థానాలు బీజేపీ, 2 కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD), BRS, BJD లకు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ రెండూ ఇండియా కూటమిలో ఉండగా.. BRS, BJD ఏ కూటమిలోనూ బాగస్వాములు కారు.