కర్ణాటక(Karnataka) ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్(DK Shiva Kumar) ఆరోపణలను కేరళ(Kerala) ప్రభుత్వం ఖండించింది. కేరళలోని ఓ ఆలయంలో తనతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddramaiah), మరికొంతమందిని లక్ష్యంగా చేసుకుని శత్రు భైరవి యాగం చేస్తున్నారని, జంతు బలి కూడా జరుగుతున్నదని శివకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.

Radha Krishnan
కర్ణాటక(Karnataka) ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్(DK Shiva Kumar) ఆరోపణలను కేరళ(Kerala) ప్రభుత్వం ఖండించింది. కేరళలోని ఓ ఆలయంలో తనతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddramaiah), మరికొంతమందిని లక్ష్యంగా చేసుకుని శత్రు భైరవి యాగం చేస్తున్నారని, జంతు బలి కూడా జరుగుతున్నదని శివకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే శివకుమార్ చెబుతున్నట్టు కేరళలోని గుడులలో ఎలాంటి జంతుబలి(animal sacrifice) జరగలేదని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో శత్రు భైరవి యాగం చేశారని, జంతు బలి కూడా జరిగిందని శివకుమార్ చెబుతున్నదాంట్లో నిజం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ అన్నారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపామని, ఇందు కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని రాధాకృష్ణన్(Radha Krishnan) అన్నారు. ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని చెబుతూ కేరళలోని ఇతర ఆలయాలలో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. కేరళ ఆలయాలలో 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు నూటికి నూరు శాతం అబద్ధమని పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.
