లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైల్లో తోసేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు స్పష్టం చేశారు. వీరి నిరసనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైల్లో తోసేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు స్పష్టం చేశారు. వీరి నిరసనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా వారి ఆందోళనకు బాసటగా నిలుస్తున్నాయి. శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ జంతర్‌మంతర్ దగ్గరకు వెళ్లి రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. వారితో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రెజ్లర్లతో మాట్లాడారు. మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్‌లు ప్రియాంకతో తమ సమస్యలు చెప్పుకున్నారు.
'సుప్రీం కోర్టు చెప్పిన తర్వాతే బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కాపీలను బయటకు చూపించలేదు. ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో ఎవరికీ తెలియదు. ఎందుకు ఎఫ్‌ఐఆర్ కాపీలను బయటపెట్టడం లేదు. ఈ రెజ్లర్లు అంతర్జాతీయ వేదికల మీద పతకాలు గెల్చినప్పుడు చప్పట్లు కొట్టాం. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టి గర్వపడ్డాం. ఇప్పుడు అదే రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఎన్నో ఇబ్బందుల తర్వాతే వారు ఇలా రోడ్డుమీదకు వచ్చారు. మరో గత్యంతరం లేక గొంతెత్తారు. కానీ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను పట్టించుకోవం లేదు. బ్రిజ్‌భూషణ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోంది. వీరి సమస్యలను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదు. మోదీ ఇప్పటి వరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలవడానికి కూడా ఎందుకు ప్రయత్నించలేదు' అని ప్రియాంకగాంధీ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. దేశం మొత్తం అండగా నిలుస్తుందని ప్రియాంకగాంధీ రెజ్లర్లకు ధైర్యం చెప్పారు.