ఈనెల 28వ తేదీన పార్లమెంట్‌(Parliment) నూతన భవనం ప్రారంభమవుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) చేతులు మీదుగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి తాము హాజరుకాబోమంటూ 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి

ఈనెల 28వ తేదీన పార్లమెంట్‌(Parliment) నూతన భవనం ప్రారంభమవుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) చేతులు మీదుగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి తాము హాజరుకాబోమంటూ 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విపక్షాల తీరును మోదీ తప్పుపట్టారు. విపక్షాలను ఈసడించుకోవడం మోదీకి అలవాటు కాబట్టి ఆ సంగతి పక్కన పెట్టేద్దాం! సావర్కర్‌ 150వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్‌ కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించతలపెట్టారు మోదీ షాలు.

ఆ రోజునే ఎందుకు? మహాత్మాగాంధీ(Mahatma Gandhi) జయంతి రోజున ప్రారంభించవచ్చు కదా? బాబాసాహెబ్‌ అంబేద్కర్‌(Ambedkar) జయంతి రోజున ప్రారంభించవచ్చు కదా? అంటే ఇందులో ఓ రహస్య ఎజెండా దాగి ఉందని అర్థమవుతోంది. మహాత్మాగాంధీ హత్యలో సావర్కర్‌ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు సావర్కర్‌ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినట్టు? విదేశీ పర్యటనలను ముగించుకుని వచ్చిన ప్రధాని ఎప్పటిలాగే విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలోనే కరోనా టీకాల గురించి కూడా మాట్లాడారు. ఇది బుద్దుడు, గాంధీ తిరిగి నేల అని, మనం శత్రువుల గురించి కూడా ఆలోచిస్తామని, మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులమని మోదీ అన్నారు.

గాంధీ తిరిగిన నేల అంటూనే గాంధీ హత్యలో పరోక్ష పాత్ర ఉన్న సావర్కర్‌కు జేజేలు పలుకుతారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ గాంధీ విగ్రహాల ముందు మోకరిల్లుతారు. గాంధీ జయంతి రోజున రాజ్‌ఘాట్‌కు వెళ్లి దండాలు పెడతారు. మళ్లీ గాంధీ వ్యతిరేకులకు ఇదిగో.. ఈ విధంగా పట్టం కడుతూ ఉంటారు. బ్రిటిష్‌(Brittish) రాజ్యానికి క్షమాపణలు చెప్పి, పెన్షన్‌ తీసుకున్న సావర్కర్‌ను ఇది హీరోగా మార్చే ప్రయత్నం కాదా అన్నది విపక్షాల సందేహం. పార్లమెంట్‌ నూతన భవానాన్ని సావర్కర్‌ జయంతి రోజున ప్రారంభించడం ద్వారా భవిష్యత్తరాలకు సావర్కర్‌ ఓ మహానుభావుడు, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాడు అని చెప్పడానికే మోదీ ఈ రోజును ఎన్నుకున్నారన్నది విస్పష్టం.

అందుకే విపక్షాలు బహిష్కరిస్తున్నాయి. పార్లమెంట్‌ కొత్త బిల్డింగ్‌ను కట్టించింది కేంద్రంలోని బీజేపీ సర్కారే. ఇందులో సందేహం లేదు. కానీ కట్టింది బీజేపీ(BJP) పార్టీ ఫండ్‌తో కాదుగా! దేశం సొత్తుతోనే కదా! మనందరి డబ్బుతోనే కదా! మరి తామే కట్టామన్న బిల్డప్‌ ఎందుకు? ఇదే ప్రతిపక్షాలకు నచ్చనది! నిజానికి ఇప్పటికిప్పుడు కొత్తగా పార్లమెంట్‌ భవనాన్ని కట్టాల్సిన పని లేదు. అందుకే ఇది దండుగమారి ఖర్చు అని విపక్షాలు అప్పుడు ఆరోపించాయి. ఈ డబ్బుతో పాఠశాలలు, ఆసుపత్రులు, పేదలు ఉండేందుకు నివాసాలు కట్టి ఉంటే బాగుండేదన్నది చాలా మంది భావన. పార్లమెంట్‌ ప్రారంభోత్సవంలో రాజకీయాలు ఉండకూడదని బీజేపీ పదే పదే అంటూ వస్తోంది.

అసలు రాజకీయాలు చేస్తున్నదే బీజేపీ! సర్దార్‌ భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, మహాత్మాగాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌.. ఇలా చెప్పుకుంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చాలా మంది యోధులు ఉన్నారు. వీరిలో ఎవరి జయంతులు మోదీకి పనికిరాకుండా పోయాయి. వీరందరి కంటే సావర్కర్‌ జయంతినే మోదీకి ఇష్టమయ్యింది. వీరందరి కంటే సావర్కర్‌ ఎలా గొప్పవారు? ఇది బీజేపీ మార్క్‌ రాజకీయాలు కావా? ఇంత చేస్తూ రాజకీయాలు చేసే సందర్భం కాదని బీజేపీ ఎలా అనగలుగుతుంది? నిజానికి పార్లమెంట్‌ కొత్త భవంతిని ఎవరు ప్రారంభించాలి? దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కదా ప్రారంభించాలి.

మరి మోదీ చేతుల మీదుగా ఎందుకు ప్రారంభిస్తున్నట్టు? ప్రారంభించడానికి ముర్ము అంగీకరించలేదన్నది బీజేపీ సైడు నుంచి వస్తున్న మాట. ముర్ము అంగీకరించలేదంటే ఆమెలో కూడా ప్రభుత్వం తీరుపై చిన్నపాటి అసంతృప్తి ఉందనుకోవాలా? రాష్ట్రపతి భవన్‌కు ఎవరు వెళ్లాలో.. ఎవరు వెళ్లకూడదో డిసైడ్‌ చేస్తున్నది ప్రధానమంత్రి కార్యాలయమే అయినప్పుడు ( ఈ విషయాన్ని జమ్ము కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ చెప్పిన సంగతి విస్మరించకూడదు) మోదీ షాల ఆదేశాలను ముర్ము కాదనగలరా? ఒకవేళ రాష్ట్రపతినే పార్లమెంట్ కొత్త భవంతిని ప్రారంభించారనుకుందాం! అప్పుడు శిలాఫలకం మీద ఆమె పేరే ఉంటుంది కదా! దీన్ని మోదీ సహించగలరా? తట్టుకోగలరా? కరోనా పోస్టర్లలోనే తన ఫోటోను ముద్రించుకున్న మోదీ పార్లమెంట్‌ భవంతి శిలా ఫలకం మీద తన పేరు వచ్చే అవకాశాన్ని ఎలా చేజార్చుకుంటారు? ఇది జరిగే పనేనా? ఇదంతా చూసిన తర్వాతే విపక్షాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరు అవుతున్నాయి.

Updated On 25 May 2023 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story