President Volodymyr Zelenskyy : ఆ రెండింటికీ మేము సిద్ధంగా ఉన్నాం.. ప్రధాని మోదీని కలిసిన తర్వాత జెలెన్స్కీ
శుక్రవారం కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు
శుక్రవారం కీవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ లో ప్రధాని మోదీ పర్యటన చర్చనీయాంశమైంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాలు కీవ్‌లో భారతీయ కంపెనీలను తెరవడానికి అనుమతించడం ద్వారా ఉక్రెయిన్ భారతదేశంతో కనెక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీ చెప్పారు. అలాగే ఉక్రెయిన్ కంపెనీలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
PM మోడీని కలిసిన తర్వాత Zelensky విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో కంపెనీలను తెరిచేందుకు.. కీవ్‌లో భారతీయ కంపెనీల ఏర్పాటుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవును, మేము సిద్ధంగా ఉన్నాము. మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనిపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. 'అవును, నేను భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని వ్యూహాత్మక చర్చలను ప్రారంభించినప్పుడు సమయాన్ని వృథా చేయకూడదు. పెద్ద విరామం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి.. మళ్లీ కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మనం ఇండియాలో కలిస్తే సంతోషిస్తాను. మీ విశాలమైన, గొప్ప దేశం గురించి నేను చాలా చదివాను. చాలా ఆసక్తికరంగా ఉంది. 'మీ దేశాన్ని చూడటానికి నాకు సమయం ఉండదు. ఎందుకంటే యుద్ధ సమయంలో నాకు ఇంకేమీ చూడటానికి సమయం లేదు. కానీ మీ ప్రజలను చూసే ఏ మార్గమైనా నాకు ముఖ్యమని నేను భావిస్తున్నాను. దేశాన్ని అర్థం చేసుకోవడమంటే ప్రజలను కూడా అర్థం చేసుకోవడమేనన్నారు.
శాంతి శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి జెలెన్స్కీ మాట్లాడుతూ.. దీనిని భారతదేశంలో నిర్వహించవచ్చని తాను ప్రధాని మోదీకి ప్రతిపాదించానని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. 'శాంతి శిఖరాగ్ర సమావేశానికి సంబంధించినంతవరకూ రెండవ శాంతి శిఖరాగ్ర సమావేశం జరగాలని నేను నిజంగా నమ్ముతున్నాను. గ్లోబల్ సౌత్ కంట్రీస్ లో ఏదో ఒక దేశం నిర్వహిస్తే బాగుంటుంది. నేను దానిని పూర్తిగా సమర్ధిస్తాను. భారతదేశంలో శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించగలమని ప్రధాని మోదీకి చెప్పాను. ఇది ఒక గొప్ప, పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అన్నారు.