భారత ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో పర్యటించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో పర్యటించారు. వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలకు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన ఘటన అనేక కుటుంబాల కలలను ఛిన్నాభిన్నం చేసిందని మోదీ అన్నారు. విపత్తులో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో కేరళ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు.
బాధితుల పునరావాసం కోసం జిల్లా కలెక్టరేట్‌లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి, అక్కడి సమావేశంలో ప్రధాని మాట్లాడారు. విషాదం జరిగినప్పటి నుండి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నానని తెలిపారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, క్యాబినెట్ సబ్‌కమిటీకి చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు విపత్తు స్థలానికి సమీపంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అంతకుముందు రోజు, కన్నూరు విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో వాయనాడ్ చేరుకున్న ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు ఎయిర్ ఇండియా వన్‌లో దిగారు. హెలికాప్టర్‌లో కొండచరియలు విరిగిపడిన చూరల్‌మల, ముండక్కై, పుంఛిరిమట్టం గ్రామాలలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు.