Vande Bharat Trains : నేటి నుంచి ట్రాక్ ఎక్కనున్న ఆరు కొత్త వందే భారత్ రైళ్లు
ఆరు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఆరు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లతో కనెక్టివిటీ, సురక్షితమైన ప్రయాణం, ప్రయాణికుల సౌకర్యాలు పెరుగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ కొత్త వందే భారత్ రైళ్లలో.. వాటి సంఖ్య 54 నుండి 60కి పెరుగుతుంది. వందే భారత్ రైళ్లు రోజుకు 120 ట్రిప్పుల ద్వారా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 280 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేస్తున్నాయి.
కొత్త రైళ్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా అనే ఆరు కొత్త రూట్లలో నడవనున్నాయి. మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 15, 2019 న ప్రారంభమైంది. ఈ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. సెప్టెంబర్ 14, 2024 వరకూ 54 వందే భారత్ రైళ్లు (అప్-డౌన్‌తో సహా రోజు 108 ట్రిప్పులు), 36,000 ప్రయాణాలు పూర్తి చేయడం ద్వారా 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. వందే భారత్ రైలు.. ప్రస్తుతం వందే భారత్ 2.0గా రూపాంతరం చెందింది. ఇవి వేగంలోనే కాక.. యాంటీ-వైరస్ సిస్టమ్, వైఫై వంటి అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంటాయి.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రధాని మోదీ నేడు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఆరు వందేభారత్ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. వందే భారత్ విస్తరిస్తోందని, మెరుగైన కనెక్టివిటీ కోసం కొత్త రైళ్లను చేర్చుతున్నామని ప్రకటన పేర్కొంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా రూపొందించిన ఈ రైలు.. లక్షలాది మంది ప్రయాణికులకు లగ్జరీ, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది.