మరికొద్ది గంటల్లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ పోలింగ్‌(Karnataka Assembly Poling) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటరు మదిలో ఏముందో, ఎవరికి పట్టం కట్టబోతున్నాడో 13వ తేదీన తెలుస్తుంది. అప్పటి వరకు రాజకీయ పక్షాలలో ఉత్కంఠ తప్పదు. ముఖ్యంగా అధికారపక్షం బీజేపీ(BJP)లో మాత్రం ఈ టెన్షన్‌ రవ్వంత ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అధికారం నిలుపుకోవడం బీజేపీకి అత్యవసరం.

మరికొద్ది గంటల్లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ పోలింగ్‌(Karnataka Assembly Poling) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటరు మదిలో ఏముందో, ఎవరికి పట్టం కట్టబోతున్నాడో 13వ తేదీన తెలుస్తుంది. అప్పటి వరకు రాజకీయ పక్షాలలో ఉత్కంఠ తప్పదు. ముఖ్యంగా అధికారపక్షం బీజేపీ(BJP)లో మాత్రం ఈ టెన్షన్‌ రవ్వంత ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అధికారం నిలుపుకోవడం బీజేపీకి అత్యవసరం. అందుకే కర్ణాటక ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రచారం సందర్భంగానే ఆ విషయం తేటతెల్లమయ్యింది. ఎన్నికలకు రెండు నెలల ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు 15 మంది కేంద్రమంత్రులను ఇందులో భాగస్వాములను చేసింది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) కూడా కర్ణాటక చుట్టూ తిరిగారు. అట్టడుగుతున్న మణిపూర్‌ను, మహిళా రెజ్లర్ల ఆందోళనను పట్టించుకోండా మోదీ, అమిత్‌షాలు కర్ణాటకకే అంకితమయ్యారు. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఓ ప్రధాని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఇదే మొదలు. మొత్తంగా 125 మంది జాతీయ నాయకులు ప్రచారంలో పాలుపంచుకున్నారు. బీజేపీ ఏకంగా 3,116 ఎన్నికల ర్యాలీలను నిర్వహించింది. 9,125 బహిరంగసభలను నిర్వహించింది. 1,377 రోడ్‌షోలు, 9,077 స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు ఉన్నాయి. ప్రధాని మోదీనే ఏకంగా 26 ర్యాలీలో పాల్గొన్నారు. చివరి రోజు బెంగళూరులో ఏకంగా 26 కిలోమీటర్ల మేర మోదీ ర్యాలీ జరిగింది. ఇక కేంద్రమంత్రి అమిత్‌ షా ర్యాలీలు, సభా కార్యక్రమాలు కూడా చాలానే ఉన్నాయి. 31 చోట్ల ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారాయన. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పది ర్యాలీలు, 16 రోడ్‌ షోలలో పాల్గొన్నారు. 15 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెళ్లారు. వీరితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ షిండే కూడా స్వామిభక్తిని చాటుకున్నారు. పది, పదిహేను మోటార్‌బైక్‌ ర్యాలీలను కూడా నిర్వహించింది బీజేపీ. బీజేపీ ఇంతగా శ్రమపడినా సర్వేలు మాత్రం కాంగ్రెస్‌కే జై కొడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయన్నది సర్వేల సారాంశం. సర్వే నివేదికలలో తేడా జరిగి బీజేపీ గెలిచిందే అనుకుందాం! అప్పుడు క్రెడిట్ మొత్తం ప్రధాని మోదీకి దక్కుతుంది. ఓటమి మాత్రం జేపీ నడ్డా ఖాతాలో పడుతుంది.. ఎప్పటిలాగే బీజేపీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి భయపడింది. ఇప్పుడు సీఎంగా ఉన్న బొమ్మైనే కొనసాగిస్తారా? లేక కొత్తవారికి పట్టం కడతారా అన్నది ఎక్కడా చెప్పలేదు.

ముఖ్యమంత్రి బొమ్మై కూడా ధైర్యంగా తాను మళ్లీ సీఎం అవుతానని చెప్పుకోలేకపోయారు. అధిష్టానానికి కోపం రాకుండా చాలా లౌక్యాన్ని ప్రదర్శించారు. బీజేపీ ఓడిపోయినా బొమ్మైకు వచ్చే నష్టమేమీ లేదు. పోతే సీఎం పదవి పోతుందంతే. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని మీడియా చెబుతూ వస్తోంది. అంటే ఓడిపోతే బొమ్మై కారణంగానే పరాజయం ఎదురయ్యిందని చెపుకోవడానికి ఇదో ముందు జాగ్రత్త చర్య అన్నమాట! గెలిస్తే మాత్రం మోదీ మ్యాజిక్‌ పని చేసిందని చెప్పుకోవచ్చు. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకుండా మోదీని చూసి ఓటేయాల్సిందిగా విన్నపాలు చేస్తూ వచ్చింది బీజేపీ. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఓ సెమీ ఫైనల్‌ లాంటివని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే మోదీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం మతాన్ని వాడుకున్నారు. జైబజ్‌రంగ్‌బలి అంటూ నినదించారు. భిన్న మతాలకు ఆలవాలమైన భారత్‌కు ప్రధానిగా ఉన్న మోదీ నోటి వెంట ఓ మత నినాదం రావొచ్చా లేదా అన్నది పక్కన పెడితే ఆయన చివరి అస్త్రంగా ఓ సినిమాను కూడా వాడుకున్నారు. బజ్‌రంగ్‌దళ్‌పై కాంగ్రెస్‌ ఏదో అంటే, బజ్‌రంగ్‌బలితో దానికి లింక్‌ పెట్టారు. ఆంజనేయస్వామిని బందీ చేయబోతున్నదంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కర్ణాటకను దేశం నుంచి విడదీయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది నిరాధార ఆరోపణ చేశారు. ఇంకా కాంగ్రెస్‌ను చాలా చాలా అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తనను చాలా సార్లు నిందించిందని కంటతడి పెట్టారు. ఇవన్నీ వర్క్‌అవుటయ్యి కర్ణాటకలో బీజేపీ గెలిస్తే మాత్రం మోదీ మ్యాజిక్‌ ఇంకా పని చేస్తూ ఉందని అనుకోవాలి.

Updated On 9 May 2023 3:11 AM GMT
Ehatv

Ehatv

Next Story