ఈ విషయంలో నన్ను క్షమించండి.. 1982లో రిచర్డ్ అటెన్‌బరో(Richard Attenborough) అనే ఇంగ్లీషాయన తీసిన గాంధీ(Gandhi) సినిమా విడుదలయ్యేంత వరకు ప్రపంచానికి మహాత్మాగాంధీ ఎవరో తెలియదు. మహాత్మాగాంధీ గొప్ప వ్యక్తి. మార్టిన్ లూథర్‌కింగ్(Martin luther king), నెల్సన్ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీ తక్కువేం కాదు. 75 ఏళ్లుగా అలాంఇ వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మన బాధ్యత కదా.?
మహాత్మా ... ఈ విషయంలో కూడా మమ్మల్ని క్షమించండి..!
ఈ విషయంలో నన్ను క్షమించండి.. 1982లో రిచర్డ్ అటెన్‌బరో(Richard Attenborough) అనే ఇంగ్లీషాయన తీసిన గాంధీ(Gandhi) సినిమా విడుదలయ్యేంత వరకు ప్రపంచానికి మహాత్మాగాంధీ ఎవరో తెలియదు. మహాత్మాగాంధీ గొప్ప వ్యక్తి. మార్టిన్ లూథర్‌కింగ్(Martin Luther King), నెల్సన్ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీ తక్కువేం కాదు. 75 ఏళ్లుగా అలాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మన బాధ్యత కదా.? ఈ మాటలన్నది మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM narendra Modi)! ఏబీపీ న్యూస్ నెట్‌వర్క్ ప్రతినిధులు రోహిత్ సావల్, రోమన ఇసర్ ఖాన్, సుమన్ డేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెల రోజులుగా మోదీ నోటి వెంట ఇలాంటి ఆణిముత్యాలెన్నో వచ్చాయి. ఎందుకంటే చెప్పుకోవడానికి మోదీకి ఏమీ లేదు. అడగడానికి జర్నలిస్టుల దగ్గర ఏమీ లేదు. అందుకే మోదీ ఏమేమో అంటున్నారు. ముస్లింలపై విద్వేషం చిమ్ముతూ ప్రసంగాలు చేసిన ఆయనే మరుసటి రోజు ఏమీ తెలియనట్టు హిందు ముస్లిం విభజన రాజకీయాలు నేను చేయను. అలా చేసిననాడు ప్రజా జీవితంలో ఉండే అర్హత నాకు లేదు అంటూ నిర్మోహమాటంగా అనేస్తారు. మనకంటూ ఓ చరిత్ర లేనప్పుడు పక్కవాడి చరిత్రను తమదిగా చెప్పుకుంటారు. నిజంగానే బీజేపీకి(BJP) ఓ చరిత్ర అంటూ లేదు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది లేదు. బ్రిటిష్(British) వాడి అడుగులకు మడుగులొత్తుతూ వారిచ్చే పెన్షన్‌ను పుచ్చుకోవడం తప్ప దేశం కోసం ఆవగింజంతైనా పాటుపడలేదు. ఏ ఆర్‌ఎస్‌ఎస్‌నైతే బ్యాన్ చేయాలని అన్నాడో, ఏ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉన్నాడో ఆ సర్దార్ పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకుంది. ఇప్పుడు గాంధీని తమ వాడిగా చేసుకునే ప్రయత్నం చేస్తోంది. చిత్రమేమిటంటే మహాత్ముడి మరణానికి కారకుడైన సావార్కర్‌కు దండాలు పెడుతూనే గాంధీని ప్రశంసించడం. బహుశా ఇది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కావచ్చునేమో!
గాంధీ లాంటి మనిషి భూమ్మీద రక్త మాంసాలతో నడిచాడంటే బహుశా భవిష్యత్తరాలు నమ్మకపోవచ్చు . ఈ మాట అన్నది ప్రఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్.
జీసస్ నాకు సందేశం ఇచ్చాడు...గాంధీ దాన్ని ఆచరణలో చూపాడు... ఈ మాటన్నది మార్టిన్ లూథర్ కింగ్.
మహాత్మాగాంధీ నాకు ఆదర్శప్రాయుడు. ఆయనే నాకు మార్గ దర్శకుడు .. ఈ మాట అన్నది నెల్సన్ మడేలా.. అన్నట్టు ఈయన పేరు కూడా మోదీకి స్పురణకు రాలేదు.. దక్షిణాఫ్రికా నాయకుడు అంటూ ఆగిపోయినప్పుడు విలేకరులే నెల్సన్ మండేలా అని అందించారు. వీరికే కాదు, టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్సెంట్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ ఇంకా చాలా మందికి గాంధీ ఆదర్శప్రాయుడు. ఆరాధ్యనాయకుడు. ఆయన మహాత్ముడు, జాతిపిత, సత్య శోధకుడు, సాత్విత చింతకుడు. మనమందరం పాడుకునే మన జాతీయ గీతం జనగణమన రాసిన రవీంద్రనాథ్ టాగూరే కదా గాంధీని మహాత్ముడు అన్నది. మరి నరేంద్రమోదీ అలా అన్నారేమిటి? పాపం ఆయనకు గాంధీ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన ప్రతీరోజూ గాంధీని శాపనార్థాలు పెట్టే శాఖలోనే కదా ఉండింది. గాంధీ జీవితకాలంలో, హత్యానంతరం సాధించిన అపారమైన ప్రాచుర్యం గురించి మోదీకి తెలిసే అవకాశమే లేదు. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పుట్టింది ఒకే రాష్ట్రమన్న సంబంధమే తప్ప ఇంకే రకమైన సంబంధం లేదు. తాను బయలాజికల్‌గా పుట్టలేదని మోదీనే చెప్పుకున్నారు కాబట్టి ఈ ఒక్క సంబంధం కూడా లేదనుకోవాలి. గాంధీ చనిపోయిన (చంపేసిన) రెండు సంవత్సరాల తర్వాత పుట్టిన నరేంద్రమోదీ చిన్నప్పుడే గాంధీని చంపిన సంస్థలో చేరారు కాబట్టే గాంధీ గురించి తెలియకపోవచ్చు. గాంధీని చంపిన గాడ్సే గురించి, హంతక ముఠాలో ఒకరైన సావార్కర్ గురించి అయితే బాగా తెలుస్తుంది.
మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతటా దుమారం రేపుతున్నాయి. దేవుడు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కాంగ్రెస్ కోరుకున్నది. గెట్ వెల్ సూన్ అంటూ మోదీతో కూడిన ఓ చిత్రాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మోదీ ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తనకు తెలియడం లేదని కాంగ్రెస్(congress) ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్(Jai Ram Ramesh) ఎద్దేవా చేశారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను బీజేపీ సర్కారే నాశనం చేసిందని ఆరోపించారు. గాంధీని హత్య చేసిన గాడ్సే సైద్ధాంతిక వారసులు మహాత్మాగాంధీ చూపిన సత్యమార్గాన్ని అనుసరించలేరని అన్నారు. దేశానికి మోదీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ విమర్శించారు.సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యాన్ని సాధించి పెట్టిన మహనీయుడాయన. అహింసకు మించిన ఆయుధం లేదని త్రికరణశుద్ధిగా విశ్వసించిన మహాత్ముడాయన. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుందని నమ్మిన మహా మనీషి ఆయన. ఆయన మహాత్ముడు, జాతిపిత, సత్య శోధకుడు. సాత్విత చింతకుడు. ఆయన ప్రపంచనాయకుడు. ఆయన గొప్పతనమేమిటో తెలుసు కాబట్టే అటెన్‌బరో ఆయన మీద సినిమా తీశారే తప్ప గాంధీని ప్రపంచానికి పరిచయం చేయడానికి కాదు. అటెన్‌బరో సినిమా వచ్చేటప్పటికే ప్రపంచంలో సుమారు అరవై దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అంతే సంఖ్యలో పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. ఆయన జయంతి రోజున అంటే అక్టోబరు 2వ తేదీని ఐక్యరాజ్య సమితి International Day of Non-Violence గా ప్రకటించింది. మన దేశంలో రామాలయం లేని ఊరు ఉండనట్టే గాంధీ విగ్రహం లేని ఊరు కూడా ఉండదు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత దాదాపుగా అన్ని దేశాలలో మోదీ పర్యటించారు. ఆయన అడుగుపెట్టిన ప్రతీదేశమూ ఆయనను గౌరవించిందంటే అందుకు కారణం గాంధీ పుట్టిన దేశం నుంచి వెళ్లారు కాబట్టి! గాంధీని ప్రపంచం అంతగా అభిమానిస్తుంది కాబట్టి!
రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ సినిమాను చాలా మంది చూసే ఉంటారు. 1982లో ఈ సినిమా విడుదలయ్యింది కానీ అటెన్‌బరో 1962లోనే గాంధీ జీవితగాధపై సినిమా తీయాలని సంకల్పించాడు. 1950లో అంటే గాంధీ హత్య తర్వాత రెండేళ్లకు వచ్చిన ఓ పుస్తకం అటెన్‌బరోను ఎంతగానో ప్రభావితం చేసింది. లూయిస్ ఫిషర్ అనే రచయిత ఏ వీక్ విత్ గాంధీ అనే పుస్తకం రాశారు. 1962లో ఈ పుస్తకాన్ని చదివిన అటెన్‌బరో భావోద్వేగాలకు లోనయ్యాడు. అప్పుడే ఆయన సినిమా తీయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. సినిమా తీసే ఆలోచన రావడంతోనే 1963లో అటెన్‌బరో ఇండియాకు వచ్చారు. ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కలుసుకున్నారు. తన మనసులో మాట చెప్పారు. నెహ్రూ సంతోషించారు. సినిమాలో గాంధీకి సంబంధించిన అన్ని కోణాలను ఆవిష్కరించాలని చెప్పారు. అప్పుడే ఆ మహోన్నతుడికి న్యాయం చేసినట్టు అవుతుందని అన్నారు. గాంధీ సినిమాను అటెన్‌బరో నెహ్రూకి అంకితం ఇస్తూ రెండు ముక్కలు రాశారు. నెహ్రూ ఇచ్చిన భరోసా, ప్రేరణలతోనే ఈ సినిమా సాధ్యమయ్యింది అని అటెన్‌బరో చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల సుదీర్ఘ సంఘర్షణ తర్వాత 1982లో ఓ అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించారు అటెన్‌బరో. 1968లో మహాత్మాగాంధీపై ఫిలిం డివిజన్ అయిదు గంటల నిడివితో ఓ సుదీర్ఘ డ్యాకుమెంటరీని రూపొందించింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, వచ్చే ఎన్నికలప్పుడు గాంధీ సినిమాను ప్రమోట్ చేసింది తానేనని మోదీ చెప్పుకున్నా చెప్పుకుంటారు కాబట్టి. భక్తులు కూడా నిజమేకదా అని గర్వపడతారు.
గాంధీని కాంగ్రెస్ విస్మరించిందంటూ కంఠశోష పెడుతున్న మోదీ అదే నోటితో గాంధీ పరివార్ అంటూ వెక్కిరిస్తారు. ఈ వైచిత్రి ఎక్కడా చూడం! ఏ కాంగ్రెస్‌ను అయితే తూలనాడుతున్నారో అదే కాంగ్రెస్ పార్టీ గాంధీ సినిమా నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించినందన్న సంగతి మోదీకి తెలియదు కాబోలు! అటెన్‌బరో ఈ బృహత్కరమైన ప్రాజెక్టును భుజాన వేసుకున్నపుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతీయ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 6.5 మిలియన్ డాలర్ల సొమ్మును నిర్మాణ సంస్థకు ఇప్పించారు. సినిమా ద్వారా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బోల్డన్ని లాభాలు వచ్చాయనుకోండి. అది వేరే విషయం. అంటే ఓ రకంగా ఈ సినిమాకు భారత్ సహ నిర్మాత అన్నమాట! గాంధీ సినిమా నిర్మాణంలో జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర ఉంది. ఇందిరాగాంధీ పాత్ర కూడా ఉందని తేటతెల్లమవుతుంది. చరిత్ర పుస్తకాలు చదవకుండా కేవలం వాట్సప్ యూనివర్సిటీ ద్వారా వచ్చేవాటినే చదివి జ్ఞానం పెంచుకునే వారికి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఈ వాట్సప్ యూనివర్సిటీవారు చెప్పిందే గోది మీడియా ప్రచారం చేస్తుంటుంది. గాంధీ సినిమా రాకముందు గాంధీ గురించి ఎవరికీ తెలియదని చెప్పేవారు ఓసారి టైమ్ మ్యాగజైన్ పాత సంచికలను చూస్తే తెలుస్తుంది. ఎన్నిసార్లు టైమ్ మ్యాగజైన్ గాంధీని ముఖచిత్రంగా వేసి మురిసిపోయిందో అవగతమవుతుంది. అదే టైమ్ మ్యాగజైన్ మోదీ కవర్ పేజీ కూడా వేసింది కానీ లోపటి పేజీలలో ఏం రాసిందో భక్తులు చదవాలి. అన్నట్టు గుజరాత్ మారణకాండ తర్వాతే కదా దేశానికి మోదీ అంటే ఎవరో తెలిసింది! అంతకు ముందు మోదీ ఎవరు?
మార్టిన్ లూథర్‌కింగ్ గురించి ప్రపంచానికి తెలుసు కానీ గాంధీ గురించి తెలియదు అంటూ మోదీ చెప్పడం హాస్యాస్పదంగానే ఉండవచ్చు కానీ, ఆ మాటలు వింటే ఆవేదన కూడా వేస్తుంది. అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మృతి చిహ్నంగా ఓ సంగ్రాలయాన్ని నిర్మించారు. అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ చిన్నప్పడు నివసించిన ఇల్లు కూడా ఉంది. ఆ నివాస ప్రాంగణంలోనే గాంధీ విగ్రహం ఉంది. మార్టిన్ లూథర్ అనేకసార్లు తన ప్రసంగాలలో, తన రచనలో గాంధీని ప్రస్తావించుకున్నారు. ఆయనే తనకు ప్రేరణ అని అన్నారు. గాంధీ బోధనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పుకున్నారు. తన కార్యాలయంలో గాంధీ ఫోటోను పెట్టుకున్నారు. ఇక మోదీ ప్రస్తావించిన నెల్సన్ మండేలాను దక్షిణాఫ్రికా గాంధీ అని అంటారన్న విషయం భక్తులకు తెలుసా? సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన మండేలా జైలు ఉంచి విముక్తి పొందిన తర్వాత గాంధీనే తనకు ప్రేరణ అని అన్నారు. ఆయన ఓ పవిత్ర యోధుడంటూ కితాబిచ్చారు. మోదీ ఏమైనా చెప్పగలరు. ఎంతైనా మాట్లాడగలరు. అది ఆయన ఇష్టం. కానీ చరిత్రను వక్రీకరించకూడదు. మోదీ మాటలు విన్న తర్వాత బీజేపీ నాయకులు కూడా లోలోపల నవ్వుకుని ఉంటారు. 2018, సెప్టెంబర్ 30 మన్‌కీ బాత్‌లో ఇదే మోదీ మహాత్ముడిని ప్రశంసిస్తూ మర్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు గాంధీనే ప్రేరణ అని చెప్పారు. తాను చెప్పిన మాటలను తానే ఖండించడం అన్నది మోదీకి అలవాటు!
ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ తీసిన ద గ్రేట్ డిక్టెటర్ సినిమా ఆఖరి సన్నివేశం అద్భుతంగా ఉంటంది. అయిదారు నిమిషాల పాటు చాప్లిన్ స్పీచ్ ఉంటుంది. అందులో గాంధీ బోధనలు, ఆలోచనలు అంతర్లీనంగా వినిపిస్తాయి. గాంధీని కలుసుకోవాలన్న కోరిక చాప్లిన్‌కు ఎంతగానో ఉండింది. రౌండ్‌టేబుల్ సమావేశం కోసం గాంధీ లండన్‌కు వెళ్లినప్పుడు చాప్లిన్ ఆయనను కలుసుకుని తన ముచ్చట తీర్చుకున్నాడు.
ఓ మనిషి వంద శాతం పవిత్రాత్ముడైతే కచ్చితంగా అతను దేవుడే. అందులో ఎలాంటి సందేహం లేదు. మానవుడై పుట్టి మాధవుడైన రాముడే అందుకు ఉదాహరణ. అలా కాకుండా ఓ డెబ్బయ్ శాతం పవిత్రాత్మను సంపాదించగలిగితే అతడు మహాత్ముడే అవుతాడు.. ఆ విషయంలో గాంధీజీ మహాత్ముడే. మహాత్ముడు అన్న పదానికి ఆయన అర్హుడే..ఆయన కొల్లాయి కట్టిన కర్మయోగి. హింసకు అహింస నేర్పిన పరమహంస. ఆయన స్ఫూర్తి పొందని దేశాలు లేవు. బక్క చిక్కిన మనోబలుడు. బోసినవ్వుల దార్శనికుడు. ఇప్పటికీ ఆయన పథమే మనకు అనుసరణీయం. సత్యమే చెప్పాలి. ఇది గాంధీ సిద్ధాంతం. మన నాయకులు మాత్రం అసత్యాలను వల్లెవేస్తుంటారు. చరిత్రను తప్పుదోవ పట్టిస్తుంటారు. బాపూ. నిన్ను ఆడిపోసుకుంటున్నవారికి , నీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నవారికి కూడా నీ చల్లని దీవెనను ఇవ్వు.నీ బాటను నడిచే బలం వారికివ్వు. రఘుపతి రాఘవ రాజారాం...పతిత పావన సీతారాం...ఈశ్వర అల్లా తేరో నాం...సబకో సన్మతి దే భగవాన్.