పెంపుడు కుక్కలు(Pet dogs) యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
పెంపుడు కుక్కలు(Pet dogs) యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అలాగే యజమాని దూరమైనా తట్టుకోలేదు. ఎంత కష్టమైన సరే, యజమానిని చేరుకుంటుంది. అచ్చంగా ఇలాంటి సంఘటన ఒకటి కర్నాకటలోని(Karnataka) బెలగావి(Belagavi) జిల్లాలో చోటు చేసుకుంది. యజమానితో కలిసి ఆ పెంపుడు కుక్క తీర్థయాత్రకు వెళ్లింది. అక్కడ తప్పిపోయింది. అనూహ్యంగా అది 250 కిలోమీటర్లు ప్రయాణించి మళ్లీ యజమాని ఇంటికి చేరుకుంది. కుక్కను చూసి యజమాని ఆనందం పట్టలేకపోయాడు. దాని రాకను ఉత్సవంగా జరిపాడు. కుక్క మెడలో దండవేసి స్వాగతం పలికాడు. గ్రామస్తులకు విందు ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి మహారాజ్ అని పేరుపెట్టుకుని ఫ్యామిలీ మెంబర్‌లాగే చూసుకోసాగాడు. ప్రతి ఏటా కమలేష్ కుంభార్ భక్తులతో కలిసి మహారాష్ట్రలోని పండరిపూర్‌కు కాలినడకన తీర్థయాత్రగా వెళుతుంటాడు. ఈసారి కూడా వెళ్లాడు. అతడి వెంట పెంపుడు కుక్క కూడా వెళ్లింది. జూన్‌లో సుమారు 250 కిలోమీటర్లు నడిచిన కుమలేష్ బృందం మహారాష్ట్రలోని విఠోబా ఆలయానికి చేరుకుంది. పాండురంగ స్వామి దర్శనం తర్వాత పెంపుడు కుక్క కనిపించలేదు. ఆందోళనతో కుక్క కోసం చుటుపక్కలంతా వెతికాడు కమలేష్. మరో గుంపుతో కలిసి అది వెళ్లినట్టు కొందరు చెప్పడంతో నిరాశగా దిగులుగా ఇంటికి చేరుకున్నాడు కమలేష్. ఆ రోజంతా బాధపడుతూ ఉన్నాడు. ఆ మర్నాడు మహారాజ్ తన యజమాని ఇంటికి చేరుకుంది.
తోక ఊపుతూ ఇంటి ముందున్న తన పెంపుడు కుక్కను చూసి కమలేష్ కుంభార్ సంబరపడ్డాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని గ్రామానికి అది చేరుకోవడం చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. పాండురంగడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు కమలేష్ భావించాడు. మహారాజ్ మెడలో పూల దండ వేశాడు. హారతి ఇచ్చి ఇంటిలోపలికి తీసుకొచ్చాడు. ఊరివారందరికీ కమ్మటి భోజనం పెట్టాడు!