ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అందరి దృష్టి వీటిపై ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎడ్జ్‌లో ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయ. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అయితే కాంగ్రెస్‌కు బ్రహ్మండమైన విజయం దక్కబోతున్నదని పీపుల్స్‌ పల్స్‌ చేపట్టిన సర్వేలో తేలింది.

ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అందరి దృష్టి వీటిపై ఉంది. మధ్యప్రదేశ్‌(Madyapradesh)లో కాంగ్రెస్‌(Congress) ఎడ్జ్‌లో ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయ. రాజస్థాన్‌(Rajastan)లో కూడా కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో అయితే కాంగ్రెస్‌కు బ్రహ్మండమైన విజయం దక్కబోతున్నదని పీపుల్స్‌ పల్స్‌ చేపట్టిన సర్వేలో తేలింది. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది పీపుల్స్‌ పల్స్‌ సర్వే సారాంశం,.
పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. జూన్‌ నెలలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తం 90 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్‌ పార్టీకి 53 నుంచి 60 స్థానాలు రావచ్చు. అలాగే బీజేపీ 20 నుంచి 27 స్థానాలను గెలచుకోవచ్చు. బీఎస్పీ, ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు ఒక్కో స్థానాన్ని గెల్చుకునే అవకాశాలున్నాయని సర్వే చెబుతోంది. ఛత్తీస్‌గడ్‌లో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీకి కావాల్సిన స్థానాలు 46. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ మార్కును కాంగ్రెస్‌ పార్టీ ఈజీగా సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ చేపట్టిన సర్వేలో స్పష్టమయ్యింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 43.03 శాతం ఓట్లు లభించాయి. ఈసారి అనూహ్యంగా 2.96 శాతం ఓట్లను పెంచుకోబోతున్నది. ఈసారి కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు రావచ్చని పీపుల్స్‌ పల్స్‌ సర్వే చెబుతోంది. అలాగే 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు సంపాదించిన బీజేపీ ఈసారి అయిదు శాతం అధిక ఓట్లతో 38 శాతం ఒట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018లో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువ వచ్చాయి. ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం. చిత్రమేమిటంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందిన బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించడం. రాష్ట్రంలో ఉన్న 11 లోక్‌సభ స్థానాలలో బీజేపీ 10 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు ఆదరణ చూపడానికి కారణం ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ పాలనే! ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలను భూపేష్‌ సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఆత్మగౌరవ అంశాన్ని భూపేష్‌ ఎత్తుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ మాతారి, గదో నవా ఛత్తీస్‌గఢ్‌ వంటి నినాదాలకు ప్రజలు బాగా ఆకర్షితులయ్యారని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో వెల్లడయ్యింది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇస్తోంది. పండుగ రోజుల్లో సెలవులు ఇస్తోంది. అలాగే ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా అర్ప పైరికి ధర్‌ ను ప్రవేశపెట్టింది. ఇలాంటి సెంటిమెంట్‌ అంశాలు కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చాయి. రామవంగమన్‌ పాత్‌ పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి వాటిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసింది ప్రభుత్వం. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు నెరవేర్చింది. బెన్‌ ములాఖత్‌ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడుతున్నాయి. కహో దిల్‌ సే, కాంగ్రెస్‌ ఫిర్‌ సే , భూపేష్‌ హై తో, భరోసా హై’ వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధికి ఏ పార్టీ ఎక్కువ కృషి చేస్తున్నదని ఓటర్లను అడిగితే 48 శాతం మంది కాంగ్రెస్‌ అని జవాబిచ్చారు. 40 శాతం మంది ప్రజలు మాత్రమే బీజేపీ అన్నారు. జేసీసీ అని ఒక శాతం, బీఎస్పీ అని ఒక శాతం, ఎవరూ కారని పది శాతం మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తారా అని ఓటర్లను అడిగితే 47 శాతం మంది ప్రజలు ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది ఇవ్వమని స్పష్టం చేశారు. 13 శాతం మంది చెప్పడానికి నిరాకరించారు. ఇంతకు ముందు బీజేపీకి మూడుసార్లు అవకాశం ఇచ్చినట్టుగానే కాంగ్రెస్‌ కు కూడా మరోసారి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ చెబుతోంది. ముఖ్యమంత్రి పనితీరు బాగుందని 45 శాతం మంది ప్రజలు అంటున్నారు. ఫర్వాలేదని 15 శాతం మంది, బాగోలేదని 30 శాతం మంది చెప్పారు. పదిశాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాంగ్రెస్‌ పాలన పట్ల 20 శాతం మంది పూర్తి సంతృప్తితో ఉన్నారు. 31 శాతం మంది పాక్షిక సంతృప్తిని వ్యక్తం చేశారు. 17 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. 21 శాతం మంది పాక్షికంగా అసంతృప్తిగాఉన్నట్టు సర్వేలో వెల్లడయ్యింది.

ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తర ప్రాంతాన్ని సర్గుజ డివిజన్‌ అంటారు. ఇందులో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీ, ఓబీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జైసింగ్‌ అగర్వాల్‌ ప్రభావంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధించింది. కాబోయే ముఖ్యమంత్రి సింగ్‌డియో అన్న ప్రచారం ఇక్కడ కాంగ్రెస్‌ విజయానికి దోహదపడింది. అయితే ఆయనకు సీఎం పదవి ఇవ్వకపోవడం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉండటం ఇక్కడ కాంగ్రెస్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఇటీవల సింగ్‌డియోకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో కొంత సానుకూలంగా మారింది. 2018తో పోలిస్తే ఇక్కడ బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఉందని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది. మధ్య ఛత్తీస్‌గఢ్‌ డివిజన్‌లో రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్‌లో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ రిజర్వ్‌ స్థానాలలో అత్యధికం ఈ డివిజన్‌లోనే ఉన్నాయి. ఎస్టీ, సింధి, రాజ్‌పుత్‌, పంజాబీ, బ్రాహ్మిణ్‌ సామాజికవర్గ ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌ సావో వంటి ప్రధాన నేతలు ఇక్కడి వారే! కొన్నేళ్ల కిందట కబీర్‌దామ్‌, బీమెత్ర జిల్లాలలో మతకలహాలు జరిగాయి. ఇక్కడ ఉద్రిక్తతలు ఏరపడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీజేపీ బలపడినట్టు కనిపిస్తున్నా, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది. ఈ డివిజన్‌లో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందిన జేసీసీ, బీఎస్పీ ఇప్పుడు బలహీనపడ్డాయి. ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుంది. ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాన్ని బస్తర్‌ అని పిలుస్తారు. ఇక్కడ 12 అసెంబ్లీ స్థానాలలో 11 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలే. పైగా ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మిగిలిన ఒక స్థానాన్ని కూడా గెల్చుకుంది. ఎస్టీలతో పాటు గోండ్‌, మారియా, మురియా, భాత్ర హల్బీట్‌ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకాశాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది. రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, జగదల్‌పూర్‌, అంబిక్‌పూర్‌, కోబ్రా, రాయిగఢ్‌ మొదలగు నగరాల్లో రాజపూత్‌, బ్రాహ్మిణ్‌, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒరియా , బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత సానుకూలత కనిపిస్తోంది.
రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

Updated On 7 July 2023 3:43 AM GMT
Ehatv

Ehatv

Next Story