మళ్లీ తెరపైకి రానున్న 377, 497 సెక్షన్లు
గతంలో సుప్రీం కోర్టు(Supreme Court) కొట్టేసిన రెండు సెక్షన్లు మళ్లీ తెరమీదకు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త నేర న్యాయ బిల్లులపై పార్లమెంటరీ ప్యానెల్ సమీక్ష చేపట్టింది. పలు కీలకాంశలపై ముఖ్యమైన సవరణలను తీసుకొచ్చింది.

మళ్లీ తెరపైకి రానున్న 377, 497 సెక్షన్లు
గతంలో సుప్రీం కోర్టు(Supreme Court) కొట్టేసిన రెండు సెక్షన్లు మళ్లీ తెరమీదకు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త నేర న్యాయ బిల్లులపై పార్లమెంటరీ ప్యానెల్ సమీక్ష చేపట్టింది. పలు కీలకాంశలపై ముఖ్యమైన సవరణలను తీసుకొచ్చింది. స్వలింగ సంపర్కం(Homosexuality) (Section 377), వివాహేతర సంబంధం(Extramarital Affair) (Section 497)లను మళ్లీ నేరాలుగా పరిగణించాలని పార్లమెంటరీ ప్యానల్ సిఫారసు చేసింది. ఈ రెండు సెక్షన్‌లను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే! బీజేపీ(BJP) ఎంపీ బ్రిజ్‌లాల్‌(Brijlaal) నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం విదితమే! కొత్త చట్టంలో ఐపీసీలో సెక్షన్‌ 497ను రీ క్రిమినలైజ్‌ చేయాలని, ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి సవరణ చేయాలని ప్యానెల్‌ ప్రతిపాదించింది.

ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ నిబంధనను ప్రవేశపెట్టాలని కూడా ఉంది! 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు వివాహేతర సంబంధం నేరం కాదంటూ తీర్పు ఇచ్చింది. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్‌ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. బ్రిటిష్‌ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మగవారు మహిళలను తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిలా ఉందని వ్యాఖ్యానించింది.

ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినప్పటికీ నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వివాహేతర సంబంధాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (భారత శిక్షా స్మృతి)లోని 497వ సెక్షన్‌ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించింది. మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరమని ఆ సెక్షన్‌ చెబుతోంది.

ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్‌ 497 పేర్కొంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్‌ చేసే హక్కు భార్యకు లేదు. ఈ సెక్షన్‌ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు 2023లో కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చునని తీర్పునిచ్చింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మునుపటి తీర్పునకు సవరణ చేసింది. ఇక 377 సెక్షన్‌ విషయానికి వస్తే 2018లో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ చెల్లుబాటు కదదంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

నవతేజ్‌ సింగ్‌ జోహర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్‌ 377 చెల్లుబాటు కాదని, ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదని చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌ (ఎల్‌జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే 377 సెక్షన్‌ రద్దు తర్వాత ఆ తరహా నేరాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్‌లతో కూడిన అంగీకారరహిత లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని పార్లమెంట్‌ ప్యానెల్‌ తాజాగా సిఫార్సు చేసింది. అలాగే అసహజ శృంగారాన్ని కూడా నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసే అవకాశాలున్నాయి.

Updated On 28 Oct 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story