నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, ఢిల్లీ ఆర్డినెన్స్‌, యుసీసీపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ సారి పార్ల‌మెంట్ స‌మావేశాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. మణిపూర్ హింసాకాండపై చర్చలో రాజీపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament monsoon session) ప్రారంభం కానున్నాయి. మణిపూర్‌(Manipur)లో కొనసాగుతున్న హింసాకాండ, ఢిల్లీ ఆర్డినెన్స్‌(Delhi Ordinance), యుసీసీ(UCC)పై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ సారి పార్ల‌మెంట్ స‌మావేశాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. మణిపూర్ హింసాకాండ(Manipur Violence)పై చర్చలో రాజీపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్(Congress) ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi).. పార్లమెంటరీ నియమాలు, స్పీకర్ సూచనల ప్రకారం.. మణిపూర్‌తో సహా ఏదైనా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

మణిపూర్ హింసాకాండపై చర్చలో రాజీ లేదన్న ప్రకటనను బట్టి అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం సహా అన్ని విపక్షాలు మణిపూర్‌ హింసాకాండపై చర్చకు ప్రాధాన్యతనిచ్చాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కూడా దూకుడుగా వ్య‌వ‌హ‌రించేందుకు.. ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మ‌య్యాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేస్తూ తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ అని ఆద్మీ పార్టీతో సహా ప్రతిపక్ష నేతలందరూ పేర్కొన్నారు.

బెంగళూరులో విప‌క్షాల భేటీ త‌ర్వాత‌ జ‌రుగుతున్న స‌మావేశాలు కావ‌డంతో వాడివేడిగా సాగే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. అయితే.. ఉభయ సభల నుంచి ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం పొందకుండా ఆపడం.. ఉమ్మడి ప్రతిపక్షానికి కూడా కష్టమే. ఆగస్టు 11 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం 31 బిల్లులను ప్రవేశపెడుతుందని అఖిలపక్ష, వ్యాపార సలహా కమిటీ సమావేశాల్లో ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటిలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లుతో పాటు సినిమా పైరసీని నిరోధించే ముసాయిదా చట్టం కూడా ఉంది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఈ సెషన్‌లోనే ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో పాటు.. వయస్సు ఆధారిత కేటగిరీలో ఫిల్మ్ సర్టిఫికేట్ ఇవ్వడం, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు, వ్యక్తిగత డేటా రక్షణ, అటవీ సంరక్షణ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, సహకార రంగానికి సంబంధించిన పబ్లిక్ ట్రస్ట్ సవరణ బిల్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుల‌ను వర్షాకాల సమావేశంలో ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీజేడీ(BJD), వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP), బీఆర్ఎస్(BRS) డిమాండ్ చేశాయి. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇప్పటికే రాజ్యసభ(Rajyasabha)లో ఆమోదం పొందగా.. లోక్‌సభ(Loksabha)లో పెండింగ్‌లో ఉంది.

మరోవైపు.. మణిపూర్ హింసపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాని మోదీ(PM Modi) ప్రకటన చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ప్రతిపక్ష పార్టీల నేతలు స్పష్టంగా చెప్పారు. ద్రవ్యోల్బణం, రాష్ట్రాల హక్కుల ఆక్రమణ, సమాఖ్య నిర్మాణంపై దాడి, అదానీ(Adani) వివాదంపై జేపీసీ ఏర్పాటు డిమాండ్, ఎల్ఏసీపై చైనాతో సైనిక ఘర్షణపై మూడు సంవత్సరాలకు పైగా ప్రతిష్టంభన వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు తమ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Updated On 19 July 2023 11:30 PM GMT
Yagnik

Yagnik

Next Story