భారత్ పై పాక్ తీరు సర్వత్రా అనుమానాలకు దారితీస్తుంది. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే, సరిహద్దులో తీవ్రవాద కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తుంది. చర్చలకు సిద్ధం అంటూనే కుట్రలకు విఫల యత్నం చేస్తుంది. పాకిస్తాన్(pakistan) ప్రధాని తీరు విచిత్రంగా గోచరిస్తుంది. దానికి తాజా ఉదాహరణే ఇటీవల ఆయన చేసిన కామెంట్స్
భారత్ పై పాక్ తీరు సర్వత్రా అనుమానాలకు దారితీస్తుంది. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే, సరిహద్దులో తీవ్రవాద కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తుంది. చర్చలకు సిద్ధం అంటూనే కుట్రలకు విఫల యత్నం చేస్తుంది. పాకిస్తాన్(pakistan) ప్రధాని తీరు విచిత్రంగా గోచరిస్తుంది. దానికి తాజా ఉదాహరణే ఇటీవల ఆయన చేసిన కామెంట్స్. యుద్ధం వల్ల ఎవరికీ మేలు జరగదని చెప్తూనే తమ వద్ద అణు బాంబు(Atom Bomb) సామర్ధ్యం ఉన్నా అది ఏదేశం మీదో ప్రయోగించడానికి కాదని, కేవలం దేశ రక్షణకోసమే అని భారత్ ని ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) మళ్ళీ చర్చల ఊసు తెచ్చారు. భారత్ పేరెత్తకుండా పొరుగు దేశమంటూ ఈ ప్రస్తావన చేశారు. రెండు దేశాల మధ్య గల తీవ్ర వివాదాస్పద సమస్యలను శాంతియుతమైన, అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కరించుకొనే వీలుందని ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక సభలో అయన అన్నారు. అతి త్వరలో పాక్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణం లో షెహబాజ్ మరొకసారి చర్చల ప్రతిపాదన చేయడం విశేషం. ఆరు నెలల క్రితం కూడా షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మొదటిసారి భారత్ తో చర్చల ప్రతిపాదన చేశారు.
ఇరు దేశాలకూ యుద్ధం ప్రత్యామ్నాయం కాబోదని, అణు యుద్ధమే వస్తే ఎవరూ బతకరని పాక్ ప్రధాని అన్నారు. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం, అయితే తాము ఎవరి మీదనో ప్రయోగించడానికి అణ్వాయుధాలను సమకూర్చుకోలేదని, ఆత్మరక్షణ కోసం మాత్రమే వాటిని తయారు చేసుకొన్నామన్నారు. గడిచిన 75 ఏళ్ళలో మూడు యుద్ధాలు జరిగాయని , వాటి వల్ల పేదరికం, నిరుద్యోగం మరింత పెరిగాయని, ఆ యుద్ధాలవల్ల విద్యకి, ఆరోగ్యానికి, ప్రజా హితానికి అవసరమైన డబ్బు వృధా అయిందని అయన అన్నారు.
అయితే పాక్ ఈ రోజున అత్యంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది . ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎంఎఫ్(IMF) నుంచి రుణాన్ని అత్యంత కష్టంగా సాధించుకుంది. ఈ నేపథ్యంలో షెహబాజ్ చర్చల అవసరాన్ని ఎప్పటి కంటే ఎక్కువగా గుర్తించడం మంచిదే. కానీ ఇక్కడే పాక్ వక్ర బుద్ది మరో సారి బైటపడింది. యుద్ధం వద్దు చర్చలు, శాంతి గురించి ప్రవచిస్తూనే, అణుబాంబుల సామర్ధ్య మాకుంది అని చెప్పడం దేనికి సంకేతం.
శాంతి చర్చలు అంటూనే అణుబాంబు గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో అర్ధం చేసుకోవడం అంత కష్టమేమి కాదు. భారత రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ కాశ్మీర్ పర్యటనలో దేశ సరిహద్దు గురించి మాట్లాడిన మరుసటిరోజే పాక్ ప్రధాని షెహబాజ్ శాంతి జపం మాటున అణు యుద్ధం గురించి మాట్లాడి తమ వక్ర బుద్ధి ఎప్పటికి మారదని నిరూపించుకున్నారు.
అయితే షెహబాజ్ చెప్పిన తీవ్ర సమస్యల్లో కశ్మీర్ అతి ముఖ్యమైనది .అలాగే టెర్రరిజం సమస్య కూడా కీలకమైనదే. పాక్ వైపు నుంచి వచ్చి జమ్మూ కశ్మీర్‌లో దాడులు చేస్తున్న టెర్రరిస్టులు అసంఖ్యాకంగా వున్నారు. పాకిస్తాన్‌లోనే సురక్షిత శిబిరాలు ఏర్పాటు చేసుకొని తీవ్రవాదులు మన దేశంలో ప్రవేశిస్తున్నారని భారత్ ఇప్పటికే అంతర్జాతీయ వేదికల ముందు నిరూపించింది. ముంబై వరుస పేలుళ్లు, భారత్ కి మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం వంటి అంశంలో ఇప్పటికి పాక్ వైపు నుంచి సరైన ప్రతిస్పందన లేకుండా. ఆంత్రజాతీయ వేదికలమీద శాంతి వచనాలు పలకడం వెనుక పాక్ కుటిల రాజకీయం బైట పడుతుంది.
పాకిస్తాన్‌లో స్థావరాలు ఏర్పరచుకొన్న జైష్ మొహ్మమద్ వంటి టెర్రరిస్టు సంస్థలు కశ్మీర్‌లో సృష్టిస్తున్న మారణ హోమం ప్రపంచ దేశాలకి తెలిసిందే. 2019లో పుల్వామా వద్ద ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై బాంబు దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకొన్న దారుణ ఘటన తెలిసిందే. షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా వున్నప్పుడు ప్రధాని మోడీ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి గట్టిగానే ప్రయత్నించారు. 2015లో ప్రధాని మోడీ రష్యా నుంచి తిరిగి వస్తూ ఆకస్మికంగా లాహోర్ లో దిగి నవాజ్ షరీఫ్‌ను కలిశారు.1999 ఫిబ్రవరిలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ లాహోర్‌కు బస్సు యాత్ర జరిపారు.
భారత్ చిత్తశుద్ధిగా శాంతి చర్చలు జరిపిన ప్రతీ సారి పాక్ తమ దుష్ట బుద్ది బైట పెట్టుకుంటూనే ఉంది. వాజ్‌పేయీ లాహోర్ బస్సు యాత్రకు వెళ్లడాన్ని సాకుగా తీసుకున్న పాక్ కార్గిల్ లోకి చొచ్చుకువచ్చి కార్గిల్ యుద్ధనికి కారణం అయింది. ఢిల్లీ కఠ్మండ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడుదల చేయించుకున్నారు. ఇలాంటి వాటి మూలాల్లోకి వెళ్ళకుండా పాకిస్తాన్ చర్చల ప్రతిపాదన ఆచరణ రూపం ధరించడం కష్టం.