వన్ నేషన్, వన్ ఎలెక్షన్(One nation one election)..
వన్ నేషన్, వన్ ఎలెక్షన్(One nation one election).. నరేంద్రమోదీ(Narendra modi) రెండోసారి ప్రధానమంత్రిగా పదవీబాధ్యలు చేపట్టిన నాటి నుంచి ఈ పదం తరచూ వినిపిస్తూ వస్తున్నది. అంటే ఒక దేశం. ఒక ఎన్నిక అన్నమాట! ఈ విధానాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ(NDA) హయాంలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు దాదాపుగా అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయని బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం భావిస్తోంది. నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసి కూడా వంద రోజులు దాటింది. ప్రస్తుత ఎన్డీయే పదవీ కాలంలోనే ఒకదేశం ఒకేసారి ఎన్నికలు సంస్కరణను అమలు చేయనున్నారని సమాచారం. మొన్నటి ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా మోదీ తన ప్రసంగంలో ఈ విషయమే చెప్పారు. పదే పదే ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశ ప్రగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని కోవింద్ కమిటీ చెప్పింది. వీటిలో చాలా సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. కేవలం పార్లమెంట్ ఆమోదిస్తే చాలు. లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్‌సభ, శాసనసభలు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి.