ఒడిశా(Odisa) ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు చరణ్‌ మాఝీ(Charan Majhi) ప్రమాణస్వీకారం(swearing ceremony) చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ(BJP) కేంద్ర పెద్దలు రావడం పెద్ద విశేషమేమీ కాదు.

ఒడిశా(Odisa) ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు చరణ్‌ మాఝీ(Charan Majhi) ప్రమాణస్వీకారం(swearing ceremony) చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ(BJP) కేంద్ర పెద్దలు రావడం పెద్ద విశేషమేమీ కాదు. వరుసగా అయిదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నవీన్‌ పట్నాయక్‌(Naveen Patnayak) ఈ వేడుకలో పాల్గొనడమే చెప్పుకోదగిన విశేషం. నవీన్‌ పట్నాయక్‌ హాజరుకావడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఎన్నికలలో ఓటమిపాలైన నవీన్‌ పట్నాయక్‌ ఇంటికి వెళ్లి కొత్తగా ఎన్నికైన మాఝీ ఆహ్వానించడమే ఆశ్చర్యకరం. నవీన్‌ పట్నాయక్‌ కూడా ఎంతో హుందాగా, ప్రజాస్వామిక స్ఫూర్తితో ప్రమాణస్వీకారానికి హాజరుకావడం మరింత ఆశ్చర్యకరం. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అనే ప్రశ్న రావచ్చు. ఇటీవలి కాలంలో రాజకీయపక్షాల మధ్య ఇంతటి సహృద్భావాన్ని మనం చూసి ఉండం. కేంద్రంలో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. 2004లో ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ మాజీ ప్రధాని వాజపేయి అక్కడ ఉన్నారు. మన్మోహన్‌కు శుభాకాంక్షలు అందించారు. అలాగే 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకార వేడుకకు మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు. ఈ సత్సంప్రదాయం రాష్ట్రాలలో కూడా కొనసాగితే బాగుండనుకునే ప్రజాస్వామ్యవాదులు చాలా మందే ఉన్నారు. అయితే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం బహిరంగ ప్రదేశాలలో, ఓ జాతరలా, ఓ తిరునాళ్ళలా కాకుండా రాష్ట్రపతి భవనంలో జరగటం వల్ల ఈ సాంప్రదాయం కొనసాగుతుందేమో! రాష్ట్రాలలో కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్‌ బంగళా రాజ్‌భవన్‌లోనే జరిగేది. చాలా నిరాడంబరంగా, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలు జరిగేవి. ఇప్పుడు అలా కాదు. లక్షలాది మంది జనసమూహాల మధ్య ప్రమాణం చేయడం ఫ్యాషన్‌గా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా పార్టీ కార్యక్రమంగా జరపడం విచారకరం. పార్టీ అభిమానులు, నాయకులు వచ్చే బహిరంగసభలాంటి కార్యక్రమానికి ఓడిపోయిన ముఖ్యమంత్రిని, మంత్రులను పిలుస్తే వారు మట్టుకు ఎలా రాగలరు? ప్రజాస్వామ్యంపై గౌరవం కొద్దీ వచ్చారే అనుకుందాం! వారికి అక్కడ సరైన గౌరవం దొరుకుతుందా? అసలు బహిరంగ ప్రదేశాలలో ముఖ్యమంత్రి ప్రమాణం చేయడం అన్నది ఎన్‌.టి.రామారావు నుంచే మొదలయ్యింది. 1983లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జనవరి 9వ తేదీన హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఆశేష జనవాహిని ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు చెన్నారెడ్డి కూడా లాల్‌బహదూర్‌ స్టేడియంలోనే ప్రమాణస్వీకారం చేశారు. 2004 లో వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా అలాగే చేశారు. 2009లోనూ ఆయన లాల్‌బహదూర్‌ స్టేడియంలోనే ప్రజల ముందు ప్రమాణం చేశారు. ఈ విధంగా ప్రమాణ స్వీకారాలు బహిరంగ ప్రదేశాల్లో పార్టీ కార్యక్రమాల్లాగా, అత్యంత ఆర్భాటంగా, అదేదో ఓ విజయోత్సవ సభలాగా జరుపుతున్నారు. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, చాలా రాష్ట్రాలలో కనిపిస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చక్కగా రాజ్‌భవన్‌లోనే ప్రమాణం చేశారు. రెండోసారి కూడా అంతే.. కానీ 2023 చివరల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం షరా మామూలుగానే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపింది. లాల్‌బహదూర్‌ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలోనే రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు. చాలా రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలలో ఇలా బహిరంగ ప్రదేశాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ రోజులలో బుధవారం ఒడిషా చోటు చేసుకున్న ఘటన అద్భుతంగా కనిపించింది. ఇలాంటి ప్రజాస్వామిక సత్సంప్రదాయాన్ని అందరూ పాటిస్తే మంచిది. ఈ సంఘటనతోనైనా రాజకీయ నాయకులు కనులు తెరుస్తారని, వారికి కనువిప్పు జరగాలని కోరుకుందాం..

పిఎస్‌: 1999లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అనుకున్నారు. కాంగ్రెస్‌ అభిమానులు కూడా అలాగే ఆశించారు. కానీ బీజేపీ సహకారంతో తెలుగుదేశంపార్టీ గెలిచింది. తమ పార్టీ ఓటమి చెందిందని, సీఎం అయ్యే అవకాశం చేజారిందని మనసులో పెట్టుకోకుండా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కానీ 2004లో ముఖ్యమంత్రి అయిన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి చంద్రబాబు నాయుడు కనీసం మర్యాదపూర్వకంగా కూడా విష్ చేయలేదు.

Updated On 13 Jun 2024 11:52 AM GMT
Eha Tv

Eha Tv

Next Story