2029లో పెరిగిన సీట్లతో తదుపరి లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చు. 2002 డీలిమిటేషన్ చట్టం 2026 వరకూ లోక్‌సభ స్థానాలను పెంపును నిషేధించింది

2029లో పెరిగిన సీట్లతో తదుపరి లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చు. 2002 డీలిమిటేషన్ చట్టం 2026 వరకూ లోక్‌సభ స్థానాలను పెంపును నిషేధించింది. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగానే సీట్ల విభజన జరగాలని చట్టంలో స్పష్టం చేశారు. 2027లో జనాభా గణన నిర్వహిస్తే.. డేటా ఆధారంగా డీలిమిట్ చేయడంలో ఇబ్బంది ఉండదు. కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనాభా గణనను.. 2027లో నిర్వహించే అవకాశం ఉంది. ఇది 2002 నాటి డీలిమిటేషన్ చట్టాన్ని సవరించకుండా 2029కి ముందు డీలిమిటేషన్‌కు మార్గం సుగమం చేస్తుంది.

2002 నాటి డీలిమిటేషన్ చట్టంలో లోక్‌సభ సీట్లను పెంచకుండా జనాభా పంపిణీ ఆధారంగా సీట్ల డీలిమిటేషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ఆధారంగా 2008లో లోక్‌సభ స్థానాల విభజన జరిగింది. 2026 వరకు నిషేధం ఉండడంతో పాటు ఆ తర్వాత జరగాల్సిన జనాభా లెక్కల ఆధారంగా.. డీలిమిటేషన్ జరగాలనే షరతు ఉండడంతో 2031 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ జరుగుతుందని భావించారు. కానీ 2027లో జనాభా గణన జ‌రుగ‌నుంది. దీంతో 2031 జనాభా లెక్కల కోసం డీలిమిటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

2029 తదుపరి లోక్‌సభ ఎన్నికలు 543 స్థానాలకు బదులుగా దాదాపు 750 స్థానాలకు డీలిమిటేషన్ తర్వాత జరుగుతాయని.. అందులో నారీ శక్తి వందన్ చట్టం ప్రకారం.. మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయని చ‌ర్చ జ‌రుగుతుంది. లోక్‌సభ సీట్ల పెంపునకు దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకతే అతిపెద్ద అడ్డంకి. జనాభా పెరుగుదల రేటును విజయవంతంగా అరికట్టడం వల్ల దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఉత్తర భారత రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. సమాన జనాభా ప్రాతిపదికన సీట్లను నిర్ణయిస్తే.. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పడిపోవచ్చు.. దానిని వారు వ్యతిరేకిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు.. డీలిమిటేషన్ సమయంలో వారి ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడంపై దృష్టి పెడుతుంది. దీని కింద కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను నిర్ణయించే బదులు ఉత్తర భారత, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య దామాషా విధానంలో సీట్లను పెంచేందుకు ఫార్ములా రూపొందించవచ్చు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యంపై ప్రభావం పడదు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story