NEET-UG : నీట్ యూజీ పేపర్ లీక్ కేసు.. సీబీఐ తొలి ఛార్జిషీట్‌లో ఏముంది.?
నీట్ యూజీ(NEET-UG) పేపర్ లీక్ కేసులో సీబీఐ(CBI) దాఖలు చేసిన తొలి ఛార్జిషీటులో అభ్యర్థులతోపాటు అభ్యర్థుల తల్లిదండ్రులు, ఇంజినీర్లు, పేపర్ లీక్ చేసిన నేతల పేర్లు కూడా ఉన్నాయి.
నీట్ యూజీ(NEET-UG) పేపర్ లీక్ కేసులో సీబీఐ(CBI) దాఖలు చేసిన తొలి ఛార్జిషీటులో అభ్యర్థులతోపాటు అభ్యర్థుల తల్లిదండ్రులు, ఇంజినీర్లు, పేపర్ లీక్ చేసిన నేతల పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటు కూడా దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. మొదటి ఛార్జిషీట్‌లో నలుగురు నీట్ అభ్యర్థులు, ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు నాయకులు సహా 13 మంది నిందితుల పేర్లు ఉన్నాయి.
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ చార్జిషీట్‌లో నితీష్ కుమార్, అమిత్ ఆనంద్‌లను కింగ్‌పిన్‌లుగా పేర్కొనగా.. ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్‌లతో సహా నలుగురు అభ్యర్థుల పేర్లను కూడా చార్జ్ షీట్‌లో చేర్చారు. దీంతో పాటు బీహార్‌లోని దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన జూనియర్ ఇంజనీర్ సికందర్ యాద్వెందు పేరును కూడా చార్జ్ షీట్‌లో చేర్చారు. మొత్తం 13 మంది నిందితులపై నేరపూరిత ఉల్లంఘన, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని.. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటు కూడా దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
నీట్ పేపర్ లీక్ సూత్రధారి నితీశ్ కుమార్(NitishKumar) ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Bihar Public Service Commission) పరీక్ష పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. అమిత్ ఆనంద్ ముంగేర్‌లోని మంగళ్ బజార్ ప్రాంతంలో నివాసి. అమిత్ ఆనంద్‌కు అశుతోష్ కుమార్ అనే అసోసియేట్ ఉన్నాడు. అతడు జాముయి ప్రాంత నివాసి కాగా.. ప్రస్తుతం పాట్నాలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. అమిత్ ఆనంద్ మరో సహచరుడు రోషన్ కుమార్ పేరు కూడా చార్జ్ షీట్‌లో ఉంది. పేపర్ కొనుగోలు చేసేందుకు రోషన్ కుమార్ విద్యార్థులను సిద్ధం చేసేవాడని చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. పాట్నాలోని దానాపూర్ నివాసి అనురాగ్ యాదవ్ పేరు కూడా నిందితుల జాబితాలో ఉంది.
మెడికల్ అడ్మిషన్ కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలపై ఇటీవల దేశంలో చాలా దుమారం చెలరేగింది. పెద్ద సంఖ్యలో నీట్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వంపై విరుచకుపడ్డాయి. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. పరీక్ష సమయంలో ఎలాంటి వ్యవస్థాగత లోపాలు లేవని.. మళ్లీ పరీక్ష నిర్వహించడం జరగదని నిరాకరించింది.
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. నీట్ ప్రవేశ పరీక్షలో రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలపై పాట్నా పోలీసులు మొదట మే 5న కేసు నమోదు చేసి.. జూన్ 23న సీబీఐకి అప్పగించారు. మే 5న జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ కేసులో ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేయగా.. వారిలో 15 మంది నిందితులను బీహార్ పోలీసులు పట్టుకున్నారు.. ఇప్పటివరకు ఈ కేసులో 58 ప్రదేశాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.