కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చెప్పాల్సిన విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లంటే బెదురులేని రాహుల్‌గాంధీ అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు తడబాటు లేకుండా జవాబిచ్చారు

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చెప్పాల్సిన విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లంటే బెదురులేని రాహుల్‌గాంధీ అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు తడబాటు లేకుండా జవాబిచ్చారు. బీజేపీ(BJP) రంగుపూసుకున్న విలేకరులపై వ్యంగాస్త్రాలు సంధించారు. తాను క్షమాపణాలు చెప్పనని ఎందుకంటే తాను సావార్కర్‌ను కాననీ, తాను గాంధీనని గర్వంగా చెప్పుకున్నారు. దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, భవిష్యత్తులో కూడా అదే చేస్తానని స్పష్టం చేశారు. అదానీ(Adani), మోదీ(Modi) స్నేహం గురించి పార్లమెంట్‌(Parliament)లో మాట్లాడనని, వీరిద్దరి బంధం ఇప్పటిది కాదని, మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పట్నుంచి ఉందని రాహుల్‌గాంధీ చెప్పారు.

అదానికి ఎయిర్‌పోర్టులు కట్టబెట్టడానికి నిబంధనలనే మార్చారని అన్నారు. తాను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని కేంద్రమంత్రులు పార్లమెంటులో పచ్చి అబద్ధమాడారని రాహుల్‌ తెలిపారు. తాను రెండు లేఖలు రాశానని, ఏ ఒక్కదానికి సమాధానం రాలేదని చెప్పారు. స్పీకర్‌ను కలిసి లోక్‌సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వమని విన్నవించుకుంటే ఆయన నవ్వి ఊరుకున్నారే తప్ప తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాహుల్‌ వివరించారు. తానెప్పుడూ సత్యమే మాట్లాడతానని, అదే తన బలమని చెప్పారు. అదానీ షెల్‌ కంపెనీలలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఎవరు పెట్టారు? ఆ డబ్బు ఎవరిది? అని తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు జవాబు లేదన్నారు. అదాని సూట్‌కేస్‌ కంపెనీలలో రక్షణ రంగానికి చెందినవి కూడా ఉన్నాయని, వాటిపై రక్షణ శాఖ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. అదానీ-మోదీ బంధాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై అనర్హత వేటు వేశారని, దేశ ప్రజల దృష్టిని మరల్చడానికి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతకు తెగించిందని రాహుల్‌గాంధీ అన్నారు. అదానిపై తన ప్రసంగాన్ని చూసి మోదీ భయపడ్డారని, ఆయన కళ్లల్లో ఆ భయాన్ని చూశానని రాహుల్‌ తెలిపారు. బ్రిటన్‌(Britain)లో తాను అనని మాటలను అన్నట్టు చూపించారని చెప్పారు. ఈ దేశం తనకు ప్రేమ, ఆప్యాయత అన్నీ ఇచ్చిందని, అందుకే ఈ దేశ ప్రజల కోసం తాను ఏం చేయడానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు. నిజం మాట్లాడటం తప్ప తనకు వేరే మార్గం లేదని, ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా వెనకడుగు వేయనని గట్టిగా అన్నారు.

Updated On 25 March 2023 5:23 AM
Ehatv

Ehatv

Next Story